పుణె మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటన .. ‘ఇది ప్రమాదం కాదు హత్యే’ | Pune Porsche Crash: Family Of Techies Calls It Murder | Sakshi
Sakshi News home page

పుణె మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ ఘటన .. ‘ఇది ప్రమాదం కాదు హత్యే’

Published Tue, May 21 2024 5:11 PM | Last Updated on Tue, May 21 2024 7:37 PM

Pune Porsche Crash: Family Of Techies Calls It Murder

మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి.. ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో మైనర్‌కు 15 గంటల్లోనే బెయిల్‌ లభించగా.. బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా పుణెలో ఆదివారం తెల్లవారు జామున 17 ఏళ్ల బాలుడు తాగిన మైకంలో పోర్స్చే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన సంగతి తెలిపిందే. 

ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అనీశ్‌, అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటన సమయంలో మైనర్‌ 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.  కాగా మైనర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ రెండు కుంటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలు మంగళవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. 

అనీశ్‌ అవదీయా మృతదేహాన్ని మధ్యప్రదేశ్‌ ఉమారియా జిల్లాలోని బిర్సింగ్‌పూర్‌కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బంధువులు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మైనర్‌ డ్రైవర్‌కు బెయిల్‌ ఇవ్వకూడదని అనీశ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు అన్నారు.

 ‘ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఇది ప్రమాదం కాదని హత్య  మైనర్ తాగి గంటకు 240 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నాడు, అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.ఈ దుర్ఘటన జరిగిన 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారు? అతడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

గత రాత్రి అశ్విని కోష్ట మృతదేహం జబల్‌పూర్‌లోని ఆమె ఇంటికి చేరుకుంది. నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై వారి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. న్యాయ కోసం చివరి వరకు పోరాడతామని తెలిపింది. ‘మేము షాక్‌లో ఉన్నాము. నిందితుడికి 15 గంటల్లో బెయిల్ ఎలా ఇస్తారు. మైనర్‌తోపాటు అతడి తల్లిదండ్రులను విచారించాలి. అశ్విని తన కెరీర్‌పై ఎన్నో కలలు కంది. తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని కోరుకుంది. మా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. అశ్విని అంత్యక్రియలు ముగిసిన తర్వాత మేము ఈ విషయాన్ని చర్చిస్తాం’ అని పేర్కొంది.

కాాగా, ఇద్దరి మరణానికి కారణమైన మైనర్‌ బాలుడికి కోర్టు 14 గంటల్లోనే జువైనల్‌ కోర్టు బెయిలు మంజూరు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 17 ఏళ్ల మైనర్‌కు జువెనైల్‌ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, వాటికి పరిష్కారాలను తెలియజేస్తూ 300 పదాలతో ఓ వ్యాసాన్ని రాయడం, 15 రోజులపాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయడం, మానసిక పరిస్థితిపై పరీక్ష చేయించుకుని, చికిత్స పొందడం వంటి షరతులను విధించింది. ప్రమాద తీవ్రతను ఆధారంగా నిందితులను మేజర్‌గా పరిగణించి  విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోరగా కోర్టు తిరస్కరించింది.  తాజాగా పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement