మేం ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కులగణన చేపడతాం: రాహుల్ గాంధీ
కులగణన అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నాయి
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎంత అడ్డుకున్నా కులగణన, రిజర్వేషన్లకు అడ్డుగోడలు తొలగిస్తామని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా ఇదే తరహాలో కులగణన చేపడతామని ప్రకటించారు. తెలంగాణలో కులగణన ఫలితాల ఆధారంగా పాలసీలను రూపొందిస్తామని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తోల్‌కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏం చేసినా, ఎంత అడ్డుకున్నా కులగణన, రిజర్వేషన్లకు అడ్డుగోడలు తొలగించి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణలో కులగణనను ప్రజా భాగస్వామ్య ప్రక్రియగా మార్చాం. కులగణన ఏదో మూసి ఉన్న గదిలో పది పదిహేను మంది రూపొందించినది కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు అంతా కలసి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. ఇది చరిత్రాత్మకం. కర్ణాటక, తెలంగాణలాగే.. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కులగణన చేపడతాం. తెలంగాణలో కులగణన ఫలితాలు వస్తే.. దాని ఆధారంగా మేం పాలసీలు రూపొందిస్తాం.
బీజేపీ భయపడుతోంది
కులగణన అంటే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నాయి. నాలుగైదు శాతం మంది కోటీశ్వరుల కంట్రోల్‌లో ఈ దేశాన్ని పెట్టాలని బీజేపీ భావిస్తుంది. కులగణన చేయడం, రిజర్వేషన్లను 50 శాతం పెంచడం ద్వారానే దానిని ఛేదించగలుగుతాం. అదే పనిలో మేమున్నాం. దీనిని తెలంగాణ, కర్ణాటకలలో చేశాం. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచి్చనా దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, నిరుపేదల డేటా తీస్తాం. అభివృద్ధి, దేశ భవిష్యత్తులో వారి భాగస్వామ్యం ఎంత? భవిష్యత్తు ఏమిటి? అనేదే మా లక్ష్యం. ఈ వేదికపై రోహిత్ వేముల ఫొటో ఉంది. ఆయన ఎంతో మాట్లాడాలనుకున్నారు. కానీ వీళ్లు (కేంద్ర ప్రభుత్వం) రోహిత్ వేముల గొంతు నొక్కేశారు. యువత కలలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.
అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు.. ఆదివాసీలా? దళితులా?
దేశంలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్, నరేంద్ర మోదీ వీరి మధ్య అడ్డుగోడ కడుతున్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలు ఆదివాసీలా? దళితులా? దేశంలో 90 శాతం ప్రజలకు అన్యాయం జరుగుతోంది. దానికి కులగణన, రిజర్వేషన్ల పెంపు ఒక్కటే మార్గం. ఆ దిశగా ఉన్న అడ్డుగోడలను తొలగించి చూపిస్తాం. కులగణన విషయాన్ని ఊరూవాడాలో ప్రచారం చేయాలి..’’అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment