రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సీఎం ఎంపికకు మల్లగుల్లాలు పడుతోంది. రాజస్థాన్‌కు కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సహా ముగ్గురు పరిశీలకులకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. ఈ నేపధ్యంలో వారు జైపూర్ చేరుకుని, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఛత్తీస్‌గఢ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో రాజస్థాన్‌లో సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఫార్ములాను అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ తన భవిష్యత్ వ్యూహానికి సంబంధించిన అనేక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన విజయ్ శర్మలను డిప్యూటీలుగా నియమించడం ద్వారా పార్టీలోని సామాజిక, రాజకీయ, అంతర్గత సమీకరణాలను చక్కదిద్దేందుకు బీజేపీ తన వంతు కృషి చేసింది.
ఈ విధమైన ఫార్ములా ద్వారా లోక్‌సభ- 2024 ఎన్నికల వ్యూహానికి అనుగుణమైన రహదారిని ఏర్పాటు చేసింది. బీజేపీ తన ప్రత్యేక వ్యూహంలో భాగంగా గిరిజన సమాజాన్ని అక్కున చేర్చుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టింది. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయడం లేదా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన దినోత్సవంగా ప్రకటించడం, తాజాగా గిరిజన ముఖ్యమంత్రిని ఎంచుకోవడం.. ఇవన్నీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటి వరకు రాజస్థాన్‌లో వసుంధర రాజే, బాబా బాలక్‌నాథ్‌లు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారనే వాదన వినిపించింది. అయితే ఈ రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్లు బాబా బాలక్‌నాథ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వసుంధర రాజేను సీఎం చేసే విషయమై పార్టీ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. మరోవైపు సీఎం రేసులో అశ్విని వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్ రామ్ మేఘ్వాల్, సీపీ జోషి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
రాజస్థాన్‌లో జాట్ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి చెందిన ఏ నేత కూడా ముఖ్యమంత్రి పదవికి చేరుకోలేకపోయాడనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. గతంలో జాట్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లు సీఎం రేసులో వినిపించాయి. అయితే చివరి నిముషంలో వారెవరికీ అవకాశం దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విషయంలో ఇదే జరిగింది. 1973లో రామ్‌నివాస్ మిర్ధా, 1998లో పరశ్రమ్ మదెర్నా, 2008లో శిశ్రామ్ ఓలా.. ఇలా ఈ ముగ్గురూ నాడు సీఎం పదవికి పోటీదారులుగా నిలిచారు. కానీ వారికి ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించలేదు.
ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి మద్దతుగా ఒక హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. రాజస్థాన్‌లోని 10 జిల్లాల్లో దాదాపు 65 స్థానాలపై జాట్ ఓటర్లు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాగే 100 సీట్లపై నిర్ణయం తీసుకునే కీల పాత్ర పోషిస్తున్నారు. అందుకే రాజస్థాన్ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment