
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డు న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులను అంత తేలికగా తీసిపడేయలేమని, రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. బాధితురాలు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నంత మాత్రాన, డిపార్టుమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించకుండా హైకోర్టును అడ్డుకోవడం సాధ్యంకాదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్‌లోని రిటైర్డు జిల్లా జడ్జిపై ఆయన జూనియర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే, అనివార్య కారణాల దృష్ట్యా కొన్నాళ్ల క్రితం ఆమె కేసు వాపసు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సదరు జడ్జిపై ఇన్‌హౌజ్ డిపార్టుమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది.
దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు విచారణ నుంచి విముక్తి కల్పించాల్సిందిగా కోరారు. ఆయన తరఫు న్యాయవాది శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ.. ‘‘నా క్లైంట్ హైకోర్టు జడ్జిగా ప్రమోట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసిన సమయంలోనే ఈ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నానని చెబుతూ బాధితురాలు కేసు వెనక్కి తీసుకున్నారు’’ అని తెలిపారు. ఇందుకు స్పందించిన సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ‘‘లైంగిక వేధింపుల కేసులను తేలికగా తీసిపడేయలేం. ఒక వ్యక్తి ఒక సన్నని మంచుగడ్డపై నడుస్తూ ఉన్నారు.. అది ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు.
దాంతో అతడు కూడా కిందపడతాడు. మీ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. విచారణకు అంగీకరిస్తే నిర్దోషిగా తేలే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి విచారణ ఎదుర్కోండి. జూనియర్‌తో ఓ జడ్జి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఒకవేళ బాధితురాలు వేధింపుల కారణంగానే కేసు వెనక్కి తీసుకున్నారేమో! కాబట్టి హైకోర్టును విచారణకు ఆదేశించకుండా అడ్డుకోవడం కుదరదు. నిజంగా ఏ తప్పు చేయకపోతే, విచారణ ద్వారా నిర్దోషిగా తేలే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు’’ అంటూ కచ్చితంగా విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment