
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలుపై చీఫ్ సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఢిల్లీ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టులో పేరాల శేఖర్ రావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం కేంద్ర ఆరోగ్య శాఖ, తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాలకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. (ఎమ్మార్వో కేసులో హైకోర్టు స్టే: సుప్రీం అసంతృప్తి)
కోవిడ్ 19తో సహా 1500 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా ఆయుష్మాన్ భారత్ భీమా దేశంలోని అన్ని రాష్ర్టాలలో అమలులో ఉండగా తెలంగాణ, ఢిల్లీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలు అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోవిడ్ 19కు సరైన చికిత్స అందుబాటులో లేక ఎంతో మంది పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకంలో కోవిడ్ 19 చికిత్స లేదని, అలాంటప్పుడు కోవిడ్ కవరేజ్ ఉన్న ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పిటిషనర్ వివరించారు. (కరోనా టెస్టు చేయించుకున్న ఉప రాష్ట్రపతి)
కోవిడ్ రోగుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు భారీగా ఫీజులు దండుకుంటున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ భీమా పథకాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. కోవిడ్ 19 చికిత్స అంశం ఈ కేసులో ఉన్నందువల్ల విచారణకు షార్ట్ డేట్ ఫిక్స్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ చేసిన విన్నపాన్ని అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు బదులు రెండు వారాలకు ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment