
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
జలౌన్‌లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు.