![Second part of Parliament Budget session to begin on Today - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/8/PK.jpg.webp?itok=GM7oItp-)
న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫైనాన్స్ బిల్లుతో పాటు పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(సవరణ) బిల్లు, విద్యుత్(సవరణ) బిల్లు, క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు.. తదితర కీలక బిల్లులపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది. కీలకమైన పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇదే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు సభ్యుల హాజరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జాతీయ పార్టీల సీనియర్ నాయకులతో పాటు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ భేటీలకు గైర్హాజరయ్యే అవకాశముంది. తొలివిడత బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment