
జమ్మూకశ్మీర్: నూతన ఏడాదివేళ జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కాగా, కొత్త సంవత్సరం కావడంతో భక్తులు ఆలయంలో పూజలకు భారీగా తరలివచ్చారు.
ప్రధాని మోదీ సంతాపం
వైష్ణోదేవి ఆలయ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పరిహారం ప్రకటించిన లెఫ్టినెంట్ గవర్నర్
జమ్మూకశ్మీర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు.