బెంగళూరు: దేశ వ్యాప్తంగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో.. ఎన్నో విషాదాలు జరిగి ఉండొచ్చు. వందల నుంచి వేల మంది ప్రాణాలు పోయి ఉండొచ్చు. కానీ, కర్ణాటక శివమొగ్గలో జరిగిన ఘటన మాత్రం విధి ఎంత విచిత్రమైందో అని అనిపించేలా ఉంది.
శివమొగ్గ విద్యానగర్‌లో జరిగిన కొత్త సంవత్సరం వేడుక.. ఇద్దరి ప్రాణాలు బలిగొంది. వేడుకలో ఓ పెద్దాయన అతి ప్రదర్శనకు దిగబోయాడు. ఈ క్రమంలో ఆ వ్యాపారవేత్త ఓ రీసెర్చ్ స్కాలర్‌ను బలి తీసుకోవడంతో పాటు తన ప్రాణం పొగొట్టుకున్నాడు కూడా.
బిజ్‌మన్ మంజునాథ్ ఒలేకార్(67) అనే వ్యాపారవేత్త విద్యానగర్ 4వ క్రాస్‌లో కొత్త సంవత్సరం వేడుకను నిర్వహించాడు. ఆ ఈవెంట్‌కు కుటుంబంతో పాటు స్నేహితులను 50 మంది దాకా ఆహ్వానించాడు. అంతా పార్టీలో మునిగి తేలాక.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు తన డబుల్ బ్యారెల్ గన్‌ను పేల్చడానికి సిద్ధం అయ్యారు. సరిగ్గా 12 గంటల సమయంలో తూటా అమర్చి పేల్చే యత్నం చేశాడు. అయితే.. అది పొరపాటున పేలి తన పక్కనే ఉన్న వినయ్(34) అనే యువకుడిలోకి తూటా దూసుకెళ్లింది.
వెంటనే వినయ్‌ని ఆస్పత్రికి తరలించారు అక్కడున్నవాళ్లు. అయితే ఆ ఘటనతో ఒలేకార్ షాక్ తిన్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న వినయ్‌కి ఏమైందోనని భయాందోళనకు గురయ్యాడు. ఆ క్రమంలో ఊపిరి ఆడక.. అక్కడికక్కడే కుప్పకూలాడు. షాక్‌లో ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు వినయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశాడు. ఒలేకర్ కొడుకు స్నేహితుడైన వినయ్.. పీహెచ్‌డీ స్కాలర్. అతని తండ్రి పీడబ్ల్యూడీ ఇంజినీర్.
మంజునాథ్ ఒలేకార్ కాల్చింది లైసెన్స్‌డ్ రివాల్వర్ అవునా? కాదా? అనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. గతంలోనూ ఆయన ఇలా బహిరంగంగా తుపాకినీ గాల్లోకి కాల్చాడని స్థానికులు కొందరు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment