ఘజియాబాద్: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు. కాల్పుల వ్యవహారంపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హపూర్ పోలీసులు తెలిపారు. మీరట్ జోన్ ఐజీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. యూపీలో మరో వారం రోజుల్లో మొదటి దశ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఒవైసీపై హత్యాయత్నం చోటుచేసుకోవడం సంచలనాత్మకంగా మారింది.
కాల్పుల వెనుక ఎవరున్నారో తెలియాలి
ఎన్నికల ప్రచారం కోసం అసదుద్దీన్ ఒవైసీ గురువారం ఉదయమే ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. మీరట్, కిఠోరిలో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన కాన్వాయ్‌లో నాలుగు కార్లు ఉన్నాయి. ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఛిజార్సీ టోల్‌గేట్ వద్ద తన కారుపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ముగ్గురు నలుగురు పాల్గొన్నారని అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఆయుధాలు అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపారు.
తన కారు టైర్ పంక్చర్ కావడంతో మరో వాహనంలో వెళ్లిపోయానని చెప్పారు. తామంతా క్షేమంగా ఉన్నామని, అల్లాకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. టోల్‌గేట్ వద్ద కారు వేగం తగ్గిందని, అకస్మాత్తుగా మూడు నాలుగు రౌండ్లు తుపాకీ మోతలు వినిపించాయని ఒవైసీ మీడియాతో చెప్పారు. టైర్ పంక్చర్ కావడంతోపాటు కారుపై బల్లెట్ గుర్తులు కనిపించాయన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారో కచ్చితంగా తెలియాలని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీతోపాటు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కోరారు.
మరో దుండగుడి కోసం గాలింపు
కాల్పులపై ఒవైసీ ట్వీట్ చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించారని అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారని చెప్పారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని సేకరించారని, ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అందులో కనిపిస్తోందని వివరించారు. వారిని ఒకరిని గౌతమ్‌బుద్ధనగర్ జిల్లా బాదల్‌పూర్ వాసి సచిన్‌గా గుర్తించి, అరెస్టు చేశామని తెలిపారు. అతడి వద్ద చట్టవిరుద్ధంగా ఉన్న పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాల్పుల వెనుక గల అసలు కారణాలను శోధిస్తున్నామని ఉద్ఘాటించారు. కాల్పుల్లో పాల్గొన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కా ల్పుల సమాచారం తెలియగానే ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఉలిక్కిపడ్డ హైదరాబాద్ పాతబస్తీ
అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు జరగడంతో హైదరాబాద్ పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల గురించి ప్రచార, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం కావడంతో కలకలం రేగింది. ఆందోళనకు గురైన ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు సమాచారం తెలుసుకునేందుకు దారుస్సలాంకు పరుగులు తీశారు.
కారుపై బుల్లెట్ల గుర్తులు ‘బీజేపీని శిక్షించండి’
న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి గుణపాఠం చెప్పాల్సిందిగా ఆ రాష్త్ర రైతులకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) గురువారం పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు 57 రైతు సంఘాలు కూడా మద్దతిచ్చాయి. రైతుల డిమాండ్లను పట్టించుకోకపోవడం ద్వారా వారికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ దుయ్యబట్టారు. అయితే ఫలానా పార్టీకి ఓటెయ్యాలని చెప్పడం మోర్చా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
మా పాలనలో మతకలహాల్లేవు!
లక్నో: తమ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఉత్తరప్రదేశ్‌లో ఒక్కమారు కూడా మత ఘర్షణలు జరగలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గత ప్రభుత్వాల హయంలో భారీగా మతకలహాలు జరిగేవని సమాజ్‌వాదీపై విమర్శలు గుప్పించారు. బీఎస్‌పీ హయాంలో 364, ఎస్‌పీ హయంలో 700 మత ఘర్షణలు జరిగాయని, వీటిలో వందలమంది మరణించారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చెబుతోందన్నారు.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
Comments
Please login to add a commentAdd a comment