లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రులు, ఓబీసీ కీలక నేతలు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్‌సింగ్ సైనీ శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. మౌర్య రాజీనామా చేయగానే ఆయనకు మద్దతుగా రాజీనామా చేసిన ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు అప్నా దళ్(సోనేలాల్) ఎమ్మెల్యే అమర్‌సింగ్ చౌధరి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్పీ గూటికి చేరిన ఎమ్మెల్యేలలో భగవతి సాగర్ (బిల్హార్ నియోజకవర్గం), రోషన్‌లాల్ వర్మ (తిల్హార్), వినయ్ శక్య (బిధూనా), బ్రజేష్ ప్రజాపతి (తిండ్వారి), ముఖేశ్ వర్మ (శికోహబాద్)లు ఉన్నారు.
అప్నాదళ్‌కు చెందిన చౌధరి షోహర్త్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో వీరందరికీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. లక్నో పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం భారీ బహిరంగ సభను తలపించింది. అనుమతిలేకుండా సభ నిర్వహించారంటూ దాదాపు 2,500 మంది ఎస్పీ కార్యకర్తలపై కేసు నమోదుచేసినట్లు లక్నో పోలీస్ కమిషనర్ చెప్పారు. అయితే, ఇది వర్చువల్ ర్యాలీ అని, పిలవకుండానే వారంతా వచ్చారని సమాజ్‌వాదీ పార్టీ వివరణ ఇచ్చింది.
మూడు సీట్లే: అఖిలేశ్ ఎద్దేవా
యూపీ ఎన్నికల్లో బీజేపీకి 3/4 సీట్లు కాదని మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజల్లో 80 :20 అంటూ 80 శాతం మంది బీజేపీ వైపు ఉన్నారన్న వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. తమకే 80 శాతం ఓట్లు వస్తాయన్న అఖిలేశ్ ఇప్పుడు స్వామిప్రసాద్ మౌర్య, ఇతర ఓబీసీ నేతల రాకతో ఆ 20% ఓట్లు కూడా బీజేపీకి దక్కబోవన్నారు. యోగి లెక్కలు నేర్చుకోవడానికి ఒక గణితం టీచర్‌ని పెట్టుకుంటే మంచిదంటూ ఆదిత్యనాథ్‌కి చురకలంటించారు. బీజేపీలో వికెట్లు ఒక దాని తర్వాత మరొకటి పడిపోతున్నాయన్న అఖిలేష్ హేళన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment