Sonia Gandhi's Comments on Political Retirement Raipur Plenary Session - Sakshi
Sakshi News home page

క్రియాశీల రాజకీయాలకు ఇక గుడ్‌బై? ప్లీనరీలో సోనియా ప్రసంగ ఆంతర్యం అదేనా?

Published Sat, Feb 25 2023 2:59 PM | Last Updated on Sat, Feb 25 2023 3:13 PM

Sonia Gandhi Comments Political Retirement Raipur plenary session - Sakshi

రాయ్‌పూర్‌: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ(76) క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా?. తాజాగా ఆమె చేసిన ప్రసంగం ఆంతర్యం అదేనా?.. రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించే పరోక్షంగా ఆమె ప్రస్తావించారా?. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించడం.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది ఇప్పుడు.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో.. రెండవ రోజైన శనివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 15,000 మంది కాంగగ్రెస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేసిన ఆమె.. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. 

ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ‘‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది. ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు. ప్రత్యేకించి.. రాహుల్‌ గాంధీకి అని తెలిపారామె. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారామె.  కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. 

ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు సోనియా గాంధీ. బీజేపీ విదేష్వాగ్ని రాజేస్తోందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటోందని చెప్పారామె. రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement