
భారతదేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉండటమే కాకుండా, హిందూతత్వానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. కుంభమేళా సమయంలో విచిత్ర వేషధారణ కలిగిన, స్వామీజీలు బాబాలు కనిపిస్తుంటారు. కంప్యూటర్ బాబా మొదలుకొని హిట్లర్ బాబా వరకు వింతవింత వేషధారణలు కలిగిన బాబాలు ప్రయాగ్‌రాజ్‌లో కనిపిస్తారు. వీరిని చూసిన జనం తెగ ఆశ్చర్యపోతుంటారు.
కంప్యూటర్ బాబా: అసలు పేరు నామ్‌దేవ్ దాస్ త్యాగి. ఆధునిక సాంకేతికత-మత విశ్వాసలకు ప్రతీకగా కనిపిస్తారు. ఈ బాబా సాంకేతిక జ్ఞానంతో పాటు మతపరమైన జ్ఞానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఈయనకు కంప్యూటర్ బాబా అనే పేరు వచ్చింది. ఈ బాబా ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్ లాంటి ఆధునిక గాడ్జెట్‌లను ఉపయోగిస్తారు. పర్యావరణ పరిరక్షణ, గంగా నది శుద్ధి తదితర అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తుంటారు.
హిట్లర్ బాబా: ఈయన కుంభమేళాలో తన కఠినమైన క్రమశిక్షణ, ప్రత్యేకమైన దుస్తుల పరంగా పేరొందారు. ఆయన పేరు వినగానే జర్మన్ నియంత హిట్లర్ గుర్తుకు వస్తాడు. హిట్లర్ బాబా తాను క్రమశిక్షణ, స్వావలంబనను అనుసరిస్తుంటానని చెబుతుంటారు.
జఠాశంకర్ బాబా: ఈయన పొడవైన కురులతో అందరినీ ఆకర్షిస్తుంటారు. కఠినమైన తపస్సుకు ప్రసిద్ధి చెందారు. హిమాలయాల గుహలలో ఏకాంతంగా ధ్యానం చేస్తుంటారు. త్యాగం, తపస్సుల ప్రాముఖ్యతను అందరికీ చెబుతుంటారు.
గోల్డెన్ బాబా: తన అసాధారణ జీవనశైలి కారణంగా గోల్డెన్ బాబా వార్తల్లో నిలుస్తున్నారు. బంగారు ఆభరణాలను ధరిస్తారు. కుంభమేళాలో కనిపించే ఈయన తన బంగారు ఆభరణాలతో భక్తులను ఆకర్షిస్తుంటారు.
అఘోరి సాధువులు: అఘోరి సాధువుల ఉనికి కుంభమేళాలో కనిపిస్తుంది. ఈ తరహా సాధువులు శ్మశాన వాటికలలో నివసిస్తుంటారు. మరణాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు. అఘోరి సాధువులు అసాధారణమైన సాధనా మార్గాలను అవలంబిస్తారు.
నాగ సాధువులు: కుంభమేళాలో నాగ సాధువులు కనిపిస్తారు. ఈ దిగంబర (నగ్న) సాధువులు కఠినమైన జీవనశైలి కలిగివుంటారు. కుంభమేళాలో నాగ సాధువుల రాజ స్నానం ప్రముఖమైనదిగా భావిస్తారు.
మహిళా సాధువులు: కుంభమేళాలో పురుష సాధువులే కాకుండా, మహిళా సాధువులు కూడా తమ ఉనికిని చాటుకుంటారు. త్రికాల భవన్త, సాధ్వి మమత తదితర సాధువులు ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తారు. మహిళా సాధికారతకు ప్రతీకగా కనిపిస్తారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌కు స్టీవ్ జాబ్స్ సతీమణి