న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అది రాజ్యాంగమే గుర్తించిన అత్యంత అమూల్యమైన, విస్మరించేందుకు వీల్లేని హక్కు. దానికి విఘాతం కలిగిందంటూ వచ్చే విన్నపాలను ఆలకించడం మా రాజ్యాంగపరమైన విధి. అది మా బాధ్యత కూడా’’ అని స్పష్టం చేసింది. యూపీకి చెందిన ఓ వ్యక్తికి రాష్ట్ర విద్యుత్ శాఖ పరికరాలు దొంగిలించిన కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది.
నిందితునికి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 9 అభియోగాల్లో ఒక్కోదానికి రెండేళ్ల చొప్పున అతనికి విధించిన జైలు శిక్షను మొత్తంగా రెండేళ్లకు కుదించింది. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విన్నపాలను ఆలకించి న్యాయం చేయని పక్షంలో మేమిక్కడ కూర్చుని ఇంకేం చేస్తున్నట్టు? మేమున్నదే అలాంటి పిటిషనర్ల ఆక్రందనను విని ఆదుకునేందుకు! అలాంటి కేసులను విచారణకు స్వీకరించకపోవడమంటే న్యాయ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించడమే. చూసేందుకు అప్రాధాన్యమైనవిగా కనిపించే ఇలాంటి చిన్న కేసుల విచారణ సమయంలోనే న్యాయ, రాజ్యాంగపరమైన కీలక ప్రశ్నలు, అంశాలు తెరపైకి వస్తుంటాయి.
సుప్రీంకోర్టు చరిత్రే ఇందుకు రుజువు. పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యానికి ఆర్టికల్ 136లో పేర్కొన్న రాజ్యాంగ సూత్రాలే స్ఫూర్తి’’ అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అందుకే ఏ కేసు కూడా సుప్రీంకోర్టు విచారించకూడనంత చిన్నది కాదు, కాబోదు’’ అని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులు కొండంత పేరుకుపోయిన నేపథ్యంలో చిన్నాచితకా బెయిల్ దరఖాస్తులు, పసలేని ప్రజాప్రయోజన వ్యాజ్యాల వంటివాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించొద్దని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు రెండు రోజుల క్రితం అభిప్రాయపడటం తెలిసిందే. అంతేగాక కొలీజియం వ్యవస్థ విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టు మధ్య కొంతకాలంగా ఉప్పూనిప్పు మాదిరి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీజేఐ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment