న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై ప్రభావం చూపించేలా సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఉండే అధికారాలకు కత్తెర వేసింది. రాష్ట్ర హైకోర్టుల ముందస్తు అనుమతి లేకుండా ప్రాసిక్యూటర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల్ని వెనక్కి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ప్రజాప్రతినిధుల కేసులపై అవసరమైన స్టేటస్ రిపోర్టులను కోర్టులకు సమర్పించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాజకీయ నాయకులపై నమోదైన క్రిమనల్ కేసుల్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది.
ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సీఆర్‌పీసీలోని సెక్షన్ 321 కింద సంక్రమించిన అధికారాన్ని వాడుతూ తమ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలపై కేసుల్ని వెనక్కి తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియా కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. యూపీ ఎమ్మెల్యేలైన సంగీత్ శామ్, సురేష్ రాణా, కపిల్ దేవ్, సాధ్వి ప్రచిలపై కేసుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందంటూ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అమికస్ క్యూరీ నివేదికపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. ఇలా చేయడం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ విచారణను ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి ముందుగా అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం ఇకపై కుదరదని తేల్చి చెప్పింది. ట్రయల్ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్స్ సమాచారం అందించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం, దర్యాప్తు సంస్థలు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు, వాటి విచారణ ఎంతవరకు వచ్చాయో పూర్తిస్థాయి నివేదిక సమర్పించడానికి ఆఖరి అవకాశం ఇస్తూ సుప్రీం బెంచ్ ఆగస్టు 25కి విచారణను వాయిదా వేసింది.
రెండేళ్లలో పెరిగిపోయిన కేసులు
నిరంతరం కఠిన పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసుల సంఖ్య గత రెండేళ్లలో బాగా పెరిగిపోయాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. 2018 డిసెంబర్ నాటికి పెండింగ్ కేసులు 4,122 ఉంటే, 2020, సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 4,859కి చేరుకుందని తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులపై కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నాయని ఆరోపించారు.
48 గంటల్లో నేర చరిత్ర చెప్పాలి
రాజకీయాల్లో నేరచరితులు లేకుండా ప్రక్షాళన చేయడానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించిన 48 గంటల్లోగా వారిపై ఉన్న నేర చరిత్రను బహిర్గతపరచాలని రాజకీయ పార్టీలకు ఆదేశించింది. ఫిబ్రవరి 13, 2020నాడు ఇచ్చిన తమ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు బెంచ్ సవరించింది. తమ పార్టీ అభ్యర్థుల నేరచరిత్రను విడుదల చేయడంలో రాజకీయ పార్టీలు విఫలమవడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మంగళవారం విచారించింది. గత ఏడాది బిహార్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల్ని ప్రకటించిన 48 గంటల్లోపు లేదంటే, నామినేషన్ వేయడానికి రెండు వారాలు ముందు అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. ఇప్పుడు ఆ ఆదేశాల్ని సవరిస్తూ 48 గంటల్లోనే తప్పనిసరిగా నేరచరిత్రను బయటపెట్టాలని అత్యున్నత న్యాయస్థానం సరికొత్తగా ఆదేశాలు జారీ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆదేశాలను పాటించని ఎనిమిది రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానాలు విధించింది. సీపీఎం, ఎన్సీపీ రూ.5లక్షలు, బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జనశక్తి, సీపీఐ లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
దేశం సహనం కోల్పోతోంది
రాజకీయాల్లోకి నేరచరితులు ప్రవేశించకుండా ప్రక్షాళన చేయడం శాసన వ్యవస్థ తక్షణ ప్రాధాన్యాల్లో ఒకటిగా కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికోసం నిరీక్షిస్తూ దేశం సహనం కోల్పోతోందని వ్యాఖ్యానించింది. నేరచరితులు చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అనుమతించకూడదని, ఈ మేరకు చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు కోరినా... రాజకీయపార్టీలు పెడచెవిన పెట్టాయని. గాఢనిద్రలో నుంచి మేల్కొనడానికి నిరాకరిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయంలో తక్షణమే ఏమైనా చేద్దామనుకున్నా తమ (సుప్రీంకోర్టు) చేతులు కట్టిపడేసి ఉన్నాయని, శాసనవ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పెగసస్‌పై సోషల్ మీడియాలో చర్చలెందుకు?
పిటిషన్‌దారులపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టుకెక్కిన కొందరు పిటిషన్‌దారులు సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఆ పిటిషన్ దారులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, వ్యవస్థలపై కాస్తయినా నమ్మకం ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యంలోని బెంచ్ హితవు చెప్పింది. ఒకవైపు సుప్రీంని ఆశ్రయిస్తూనే సమాంతరంగా సోషల్ మీడియాలో చర్చలు ఎందుకు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. పెగసస్ వివాదంపై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు ఇవ్వాలో, అక్కర్లేదో ఈ నెల 16న సుప్రీంకోర్టు తేలుస్తుందని ప్రధాన న్యాయమూర్తితో పాటుగా జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తెలిపింది. తాము చర్చలకు వ్యతిరేకం కాదని, అయితే కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు బయట చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఈ విషయంపై ఆసక్తి ఉన్నవారు న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తూ కోర్టు హాల్లో చర్చించాలని, బయట కాదని పేర్కొంది. న్యాయవ్యవస్థకి సమాంతరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చించడానికి బదులుగా ఆ అంశాలన్నీ అఫిడవిట్ రూ పంలో దాఖలు చేస్తే తాము ప్రతీ అంశాన్ని క్షు ణ్ణంగా పరిశీలిస్తామని సీజేఐ.. పిటిషన్‌దారులు, జర్నలిస్టులైన ఎన్.రామ్, శశికుమార్ తరఫున హాజరైన అడ్వొకేట్ కపిల్ సిబల్‌తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment