
ఆలయాల్లోని బంగారాన్ని కరిగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు కానుకల ద్వారా సమర్పించిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తద్వారా కొత్తగా పెట్టుబడిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన కార్యక్రమానికి బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 35 వేల వరకు ఆలయాలు దేవదాయశాఖ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆలయాల పరిరక్షణ, విగ్రహాలు, ఆభరణాల భద్ర త, అన్యాక్రాంతమైన ఆస్తుల స్వాధీనం దిశగా డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయడం విధితమే. ఇందులో భాగంగా వేలాది ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని కరిగించి 24 క్యారెట్ల బిస్కెట్లుగా మార్చాలని నిర్ణయించింది.
చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..)
2,137 కేజీల బంగారం
1980 నుంచి పలు ఆలయాల్లోని 479 కేజీల బంగారాన్ని బిస్కెట్లుగా గతంలో పాలకులు మార్చారు. ఇక మిగిలిన ఆలయాల్లో 2,137 కేజీల బంగారం వరకూ ప్రస్తుతం ఉన్నట్లు ఇటీవలి పరిశీలనలో వెలుగు చూసింది. దీంతో ఈ బంగారాన్నంతా కరిగించి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లుగా మార్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కొత్త కార్య క్రమానికి సీఎం స్టాలిన్ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా తిరుచ్చి సమయపురం మారియమ్మన్, తిరువేర్కాడు దేవీ కరుమారియమ్మన్, విరుదునగర్ ఇమక్కంకుడి మారియమ్మన్ ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు సమర్పించిన కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని కరిగించేందుకు చర్యలు తీసుకున్నారు.
బిస్కెట్లుగా మార్చిన తరువాత ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నారు. తద్వారా కొత్త మార్గంలో ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. దశల వారీగా అన్ని ఆలయాల్లోని బంగారం కరిగించి బిసెట్లుగా మార్చే విధంగా దేవదాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. కాగా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను.. ఈప్రక్రియను నిఘా నీడలో పకడ్బందీగా చేపడుతున్నారు. కాగా కార్యక్రమం ప్రారంభోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment