
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తిచేసినా చిన్నమ్మ శశికళను కారాగారం నీడ వెంటాడుతూనే ఉంది. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సమయంలో లగ్జరీ జీవితం కోసం రూ.2 కోట్లు లంచం ఎరవేసిన వ్యవహారం రుజువై చిన్నమ్మ మెడకు బిగుసుకుంటోంది. వివరాలు.. తమిళనాడులో 1991–96 మధ్యకాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అప్పటి సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నలుగురికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జయ మరణం తరువాత 2017 ఫిబ్రవరి 15వ తేదీన తుదితీర్పు వెలువడింది.
దీంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాకాలాన్ని పూర్తిచేసుకుని విడులయ్యారు. బెంగళూరు జైల్లో శశికళ సాధారణ ఖైదీలాగ కాకుండా లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించడం, ఇళవరసితో కలిసి బెంగళూరులో షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వారికి ఈ వెసులుబాటు కల్పించిన జైలు ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో విచారణ కూడా జరిగింది.
డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయ్యాయి. కాగా చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన కేసుపై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్ట్ 25న తొలివిడత చార్జిషీటు దాఖలైంది. ఈ కేసు కర్ణాటక హైకోర్టులో బుధవారం మరోసారి విచారణ వచ్చింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ హాజరై జైలు అధికారులకు లంచం ఇచ్చిన కేసులో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా తుది చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈకేసుపై త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment