న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన కిసాన్ ర్యాలీ హింసాత్మకం కావడం.. పోలీసులపై దాడులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. జాతీయ వేడుక నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ రోజు హింసాత్మకంగా మారడానికి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే మొత్తం 25మంది ఎఫ్‌ఆర్‌ఐలు నమోదు చేశారు. తాజాగా 20 మందికి నోటీసులు పంపారు.
గణతంత్ర రైతు పరేడ్‌లో ఉద్రిక్త పరిస్థితులపై వివరణ ఇవ్వాలని కోరుతూ మొత్తం 20 మంది రైతు నాయకులకు నోటీసులు పంపించారు. కిసాన్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. నోటీసులు యోగేంద్ర యాదవ్, బాల్‌దేవ్ సింగ్ సిర్సా, బల్బీర్ రాజేవాల్‌తో పాటు పలువురు ఉన్నారు. మూడు రోజులైనా ఢిల్లీలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పోలీసులు పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు. రైతులు రెచ్చిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పోలీసులు పంపిన వాటిపై రైతు ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో.. ఏమని సమాధానమిస్తారో ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి రైతులతో పాటు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తోంది. ఎర్రకోటపై ఇతర జెండాలు ఎగురవేయడంతో పాటు విధ్వంసం సృష్టికి కారకులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment