
అగర్తల: కొడుకులకన్నా కూతురు నయం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఇంకా వివక్ష ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెకు విషం ఇచ్చి హత్య చేసిన ఘటన.. విషాద వాస్తవానికి నిదర్శనంగా నిలుస్తోంది.
త్రిపుర రాష్ట్రం ఖోవై జిల్లా బేహలాబారి గ్రామంలో దారుణం జరిగింది. త్రిపురా స్టేట్ రైఫిల్స్‌కు చెందిన జవాన్ రతీంద్ర దేవ్‌బర్మా తన ఏడాది కుమార్తెను విషమిచ్చి హత్య చేశారు. అయితే,తండ్రి విషం ఇవ్వడంతో చిన్నారి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం త్రిపురా రాజధాని అగర్తల జీబీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.
నిందితుడు రతీంద్ర దేవ్ బర్మా త్రిపురా స్టేట్ రైఫిల్స్ పదోవ బెటాలియన్ తరుఫున ఏడీసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా.. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రతీంద్రదేవ్‌ను కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది.
కుమార్తె మరణంపై గుండెలవిసేలా రోధిస్తున్న తల్లి మిథాలీ.. తన భర్త రతీంద్రదేవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కుమార్తెకు బిస్కెట్లు కొనుక్కునే నెపంతో తమ కూతురు సుహాని దేవ్ బర్మా విషం తినిపించాడని ఆరోపించింది. తన భర్తకి ఎప్పుడూ కుమారులే కావాలి. ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చినందుకు తనను నిరంతరం ద్వేషిస్తుండేవారని వాపోయింది.
మేం బెహలబరిలోని నా సోదరి ఇంటికి వెళ్తున్నాము. అప్పుడు నా భర్త.. నా కుమార్తెను, నా సోదరి కొడుకుకు బిస్కెట్లు కొనిచ్చేందుకు సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. వెంటనే, నా సోదరి కొడుకు, నా కుమార్తె వాంతులు,విరోచనాలు చేసుకున్నారు. నా కుమార్తె నోటి వెంట క్రిమిసంహారక మందు వాసన రావడాన్ని గమనించా. ఆస్పత్రికి తరలించా. కుమార్తెకు.. నా భర్త హాని తలపెట్టి ఉంటాడని అనుమానించా. అతడిని నిలదీశా. కుమార్తెకు విషం ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భర్తే తన కుమార్తె సుహాని ప్రాణాలు తీశాడని, అతడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.