హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2020 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తోంది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. అభ్యర్థుల ఈ–అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా సివిల్స్ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. (50 రూపాయలకే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్)
తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్ శ్వేతా మహంతి తెలిపారు. అలాగే వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్ వైజర్లతో పాటు 99 లోకల్ ఇన్‌స్పెక్షన్ అధికారులు, 34 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.
దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
Published Sun, Oct 4 2020 9:31 AM | Last Updated on Sun, Oct 4 2020 9:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment