Video: Giant Rock Crushes Cars In Nagaland; 2 Dead, 3 Injured - Sakshi
Sakshi News home page

Video: భయంకర దృశ్యాలు.. కొండచరియలు విరిగి కార్లపైకి దూసుకొచ్చి..

Published Wed, Jul 5 2023 10:12 AM | Last Updated on Wed, Jul 5 2023 10:58 AM

Video: Giant Rock Crushes Cars In Nagaland 2 Dead 3 Injured - Sakshi

నాగాలాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి రోడ్డుపై పడటంతో ఆ దారిలో వెళ్తున్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. చుమౌకెడిమా జిల్లాలోని జాతీయ రహదారి 29పై మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది.

భారీ వర్షాల కారణంగా దిమాపూర్‌ నుంచి కోహిమా మధ్యరోడ్డు మీద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇంతలో పక్కనే ఉన్న ఎత్తైన కొండపై నుంచి భారీ బండరాయి రోడ్డు మీదకు దూసుకురావడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో కొహిమా నుంచి వస్తున్న రెండు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సంఘటన స్థలంలోనే ఓ వ్యక్తి మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన భయంకర దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ‘పాకలా పహార్’ అని పిలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ ప్రదేశంలో ఎక్కువగా కొండచరియలు విరిగిపడటం, రాళ్లు జారిపడటం తరుచుగా జరుగుతుంటాయి. మరోవైపు ఈ దుర్ఘటనపై నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియు రియో విచారం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘దిమాపూర్, కోహిమా మధ్యనున్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం 5 గంటలకు బండరాయి పడిపోవడంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు అత్యవసర సేవలు, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాం’  అని ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement