Woman Slaps Haryana MLA: ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగి పొర్లడంతో జనావాసాల్లోకి వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి.
ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు స్థానికుల నుంచి చేదు అనుభం ఎదురైంది. వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదర్కొన్న ఓ బాధితురాలు ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటన బుధవారం హర్యానాలో వెలుగు చూసింది.
గుహ్లా జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గగ్గర్ నది పొంగిపొర్లడంతో ఆ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. చిన్న ఆనకట్ట తెగిపోవడంతో ఆ గ్రామం వరదమయమైంది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఎందుకొచ్చావంటూ చుట్టూ జనం ఉండగానే ఎమ్మెల్యేపై చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#WATCH | Haryana: In a viral video, a flood victim can be seen slapping JJP (Jannayak Janta Party) MLA Ishwar Singh in Guhla as he visited the flood affected areas
— ANI (@ANI) July 12, 2023
"Why have you come now?", asks the flood victim pic.twitter.com/NVQmdjYFb0
ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. ఓ గ్రామంలో వరద పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లినప్పుడు ప్రజలు తనను దూషించారని పేర్కొన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని మహిళకు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినిపించుకోలేదని అన్నారు. తన వల్లే ఆనకట్ట తెగిపోయిందని మహిళ ఆరోపించినట్లు చెప్పారు. అయితే సదరు మహిళను తాను క్షమించినట్లు, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. కాగా, హర్యానాలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో జేజేపీ పార్టీ మిత్రపక్షంగా ఉంది.
చదవండి: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. ఆల్‌టైమ్ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment