ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: ఇద్దరమ్మాయిల పరిచయం ప్రేమకు దారి తీసి కలిసి జీవనం సాగించే పరిస్థితికి చేరింది. తమను విడదీయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించడంతో ‘ఆ’ ఇద్దరమ్మాయిలు కోర్టుకెక్కారు. ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిగణించిన కోర్టు, ఇది వరకు కోర్టులు ఇచ్చిన తీర్పుల సమగ్ర పరిశీలన మేరకు అడుగులు వేయడానికి నిర్ణయించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మదురైకు చెందిన ఇద్దరు యువతులు తమ స్నేహ పరిచయాన్ని ప్రేమగా మార్చేసుకున్నారు. ఒకర్ని వదలి మరొకరు లేనంతగా ప్రేమ బంధంతో కలిసి జీవనం సాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరి సహజీవనం తల్లిదండ్రుల దృష్టికి చేరింది. దీంతో ఆ ఇద్దర్నీ విడదీయడానికి ఆ తల్లిదండ్రులు తీవ్రంగానే ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఈ జంట చెన్నైలోని ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది.
వీరి ద్వారా మద్రాసు హైకోర్టుకెక్కారు. తామిద్దరం కలిసి జీవించేందుకు నిర్ణయించామని, తమ భవిష్యత్తు గురించి ఇతరులకు ఎందుకో అని ప్రశ్నిస్తూ, తమకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ బుధవారం హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు వాదనల్ని విన్న న్యాయస్థానం, ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇది వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తున్నామని సూచించారు. ఇద్దరు యువతుల వాంగ్మూలం, తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. అలాగే, ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని, సమగ్ర విచారణతో ఏప్రిల్ 26వ తేదీ కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకరన్‌నును ఈమేరకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment