ఇంఫాల్: మే 3న విద్యార్థి సంఘాల ఘర్షణతో మొదలైన మణిపూర్ అల్లర్లు అటుపై దారుణ రక్తపాతానికి దారి తీశాయి. అనేక జీవితాలను చిన్నాభిన్నం చేసి ఎన్నో కుటుంబాలను చెల్లాచెదురు చేశాయి. ఇక అక్కడి మహిళలపై ఎన్ని అమానుష సంఘటనలు జరిగాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఒక మహిళ తన కూతురు కోసం ఆరా తీసే క్రమంలో జవహర్ లాలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ కి ఫోన్ చేయగా అక్కడివారు "సజీవంగా కావాలా? నిర్జీవంగా కావాలా?" అని అడిగేసరికి తన మాట గొంతులోనే ఆగిపోయిందని చెప్పుకొచ్చింది.
రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైన నాటి నుండి పరిస్థితిని కొంత నియంత్రణలో ఉంచేందుకు అక్కడ ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది అక్కడి ప్రభుత్వం. పరిస్థితి సద్దుమణిగిన కారణంగా ఈ మధ్యనే ఆ నిబంధనలను సడలించి ఇంటర్నెట్ సేవలను పునః ప్రారంభించింది. అప్పటి నుండి ఆనాటి హింసాకాండలో జరిగిన ఆటవిక సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించిన తర్వాత మొదటగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దారుణం జరిగిన మరుసటి రోజునే ఒక కార్ వాషింగ్ షోరూంలో మరో ఇద్దరు యువతులపై అల్లరిమూకలు కిరాతకానికి పాల్పడిన సంఘటన తోపాటు ఒక స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను సజీవ దహనం చేసిన మరో అకృత్యం బయటపడింది.
ఇటీవల ఒక మహిళ జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో కొంతమంది బాధితులు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని తన కూతురి ఆచూకీ కోసం వారికి ఫోన్ చేయగా.. అక్కడి మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి.. ప్రాణాలతో కావాలా? మృతదేహమైనా ఫర్వాలేదా? అని అడిగారని ఆ మాట వినగానే కళ్ళు చేతులు ఆడలేదని. తర్వాత తన కూతురు చనిపోయిందన్న విషయం తెలిపారని చెప్పి కన్నీరుమున్నీరైంది. మే 5న కార్ వాష్ షోరూంలో హత్యాచారానికి గురైన ఇద్దరి యువతుల్లో ఒకరు తన కూతురని తెలిశాక షాక్లో ఉండిపోయానని తెలిపింది.
తన కుటుంబంలో అందరికీ విషయం తెలిసినా కూడా తాను హార్ట్ పేషెంటు కావడంతో తనకు చెప్పకుండా దాచారని, నా భర్త అయితే ఇప్పటికీ కూతురు కోసం సేనాపతి హాస్పిటల్లో ఎదురు చూస్తున్నారని వాపోయింది. కూతురు డెడ్ బాడీ తమకు ఇంకా అందాల్సి ఉందని తెలిపింది. ఇలాంటి ఘటనలు మణిపూర్‌లో కోకొల్లలు. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ అల్లర్లలో జరిగిన ఒక్కో దారుణం వెలుగులోకి వస్తోంటే మనుషుల్లో మానవత్వం పూర్తిగా మసకబారిందాని అనిపించక మానదు.
ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం
Comments
Please login to add a commentAdd a comment