సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎన్నికల సమయంలో రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు పూర్తవగా, మిగతా నాలుగు దశల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకొనేందుకు అధికార టీఎంసీతో పాటు కమలదళం ఉవ్విళూరుతున్నాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఎటాక్ మోడ్‌లోనే పనిచేస్తోంది.రాష్ట్రంలో కీలకంగా, నిర్ణయాత్మకంగా ఉన్న దళితులను మచ్చిక చేసుకొనేందుకు చిన్న అవకాశాన్ని టీఎంసీ, బీజేపీలు వదులుకోవట్లేదు.
రాష్ట్రంలోని 294 అసెంబీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కు 68, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)\కు 16 స్థానాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ఓటర్లలో 23.5 శాతం, జనాభాలో 25-30 శాతం మంది ఉన్న దళితులు రాష్ట్రంలోని కనీసం 100-110 సీట్ల ఫలితాలను ప్రభావితం చేయగలరు. ఈనెల 17 నుంచి 29వ తేదీ మధ్య జరుగబోయే చివరి నాలుగు దశల్లోని ఎక్కువ స్థానాల్లో వీరి ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తు న్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మాతువా, ఆదివాసి, రాజవంశీ, బౌరి,బాగ్డి వంటి కులాలను తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు మమతా బెనర్జీ ఒకవైపు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ వర్గాలను ఆకర్షిం చేందుకు బీజేపి నాయకులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్, ఇతర సరిహద్దు జిల్లాల్లో నివసిస్తున్న రాజ్‌వంశీలు, తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు మతువాలు. దళితుల్లోని ఈ రెండు బలమైన సామాజిక వర్గాలు దక్షిణ బెంగాల్‌లోని 30-40 సీట్లలో తమ ప్రభావాన్ని చూపిస్తారు.
ఆ సామాజిక వర్గమే కీలకం
మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు చేయడంతో పాటు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ)ను అమలు చేయడంపై వారికి బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో తమ విజయానికి కారణమైన ఎంతో నమ్మకమున్న పాత ఫార్ములాను పూర్తిస్థాయిలో కమలదళం అమలుచేస్తోంది. గిరిజనులు, దళితులు, రైతుల ఇళ్ళలో భోజనం చేయడం, స్థానిక దేవాలయాల్లో పూజలు చేయడం వంటి పాత ఫార్ములాను అనుసరించడంతో పాటు బెంగాల్‌లో కొత్త ప్రయోగాలను అమలు చేస్తోంది. అందులోభాగంగా ఇంటింటికి వెళ్ళి పిడికిలి బియ్యం తీసుకోవడం, సహపంక్తి భోజనాలు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకొనే ప్రయత్నాలు గత ఏడాదిగా ముమ్మరం చేశారు.
బీజేపీ దశ మార్చిన సార్వత్రిక ఎన్నికలు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 79 మంది దళిత అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ నిలబెట్టగా, ఒక టీఎంసీ అభ్యర్థి దళితులను బిచ్చగాళ్లతో పోల్చినట్లు ఆరోపణలు రావడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం రాష్ట్రంలోని రిజర్వ్ సీట్లలో ఎక్కువ భాగం గెలుచుకుంది. ఆ తర్వాత మమతాబెనర్జీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా సీఎఎ అమలు ఆలస్యంతో పాటు అన్ని శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరించడానికి, వారికి భూమి హక్కులు ఇవ్వడం అంశాలపై దీదీ దృష్టిపెట్టింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రిజర్వు చేసిన 50 స్థానాల్లో తృణమూల్ విజయం సాధించగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలదళం ఎస్సీ ఆధిప త్య ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసుకొని 46 స్థానా ల్లో ఆధిక్యం సాధించింది. దీంతో ఇప్పుడు అధికార పీఠంపై కూర్చొనేందుకు నిర్ణయాత్మకంగా ఉన్న దళి తుల విషయంలో ఇరు పార్టీలు అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మండల కమిషన్ సిఫారసుల ప్రకారం మహిష్య, తేలి, తముల్, సాహా వంటి సామాజిక వర్గాలను ఓబిసి జాబితాలో చేర్చుతామని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు హామీ ఇచ్చాయి.
దళితుల అంశంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధాలు ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు విభజన రాజకీయాల ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల స్థాయిని బీజేపీ, టీఎంసీలు తగ్గిస్తున్నాయని సీపీఐ (ఎం) నిందించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఎప్పుడూ సైద్ధాంతిక మార్గాల్లోనే పోరాడుతున్నాయి. ఎప్పుడూ మతం, కుల ఆధారిత రాజకీయాలు వెనకబడే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీదీ బాటలో బీజేపీ
మతపరమైన మైనారిటీలతో పాటు దళితుల ఓట్లను టీఎంసీకి అనుకూలంగా ఏకీకృతం చేయాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మొదట్లో భావించారు. 2011 ఎన్నికలలో టీఎంసీ అభ్యర్థులుగా మతువాల అధికార స్థానమైన మాతువా ఠాకుర్బారి సభ్యులను దీదీ నామినేట్ చేసింది. ఈ కారణంగా మమతా బెనర్జీ విజయానికి మార్గం సుగమం అయ్యింది. అనంతరం టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి కలిసి వచ్చింది. సీఏఏను అమలు చేస్తామని బిజెపి ఇచ్చిన వాగ్దానం, దళితుల్లో అత్యల్ప వర్గాలైన బౌరిస్, బాగ్డిస్‌ల మధ్య ఆర్‌ఎస్‌ఎస్ పని చేయడం, మాతువా ఠాకూర్‌బారి సభ్యులను నామినేట్ చేయాలన్న వ్యూహం కమలదళానికి అనుకూలంగా మారింది. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ మైనార్టీలను సంతృప్తిపరచడమే కాకుండా కాకుండా, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులకు అనుకూలంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.
బెంగాల్‌లో ‘దళిత రాజకీయం’!
Published Thu, Apr 15 2021 2:51 AM | Last Updated on Thu, Apr 15 2021 2:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment