ఇంఫాల్: గిరిజనులు వర్సెస్ గిరిజనేతరుల వ్యవహారంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికి పోతోంది. గిరిజనులు ప్రధానంగా కుకీ వర్గం, గిరిజన హోదా డిమాండ్ చేస్తున్న మెయితీల నడుమ భేధాభిప్రాయలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్కడ అల్లకల్లోలం చెలరేగింది. అయితే అల్లర్లకు మీరు కారణమంటే మీరే కారణమంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఆ రెండు వర్గాలు.
అల్లర్లతో హింస చెలరేగడంతో.. భారత సైన్యం అక్కడ అడుగుపెట్టింది. మెయితీల గిరిజన హోదాకి సంబంధించి తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిరసిస్తూ చూరాచంద్‌పూర్‌లో గిరిజన గ్రూపులు చేపట్టిన యాత్ర.. హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజధాని ఇంఫాల్‌తో పాటు చూరాచంద్‌పూర్, కంగ్‌పోక్పి జిల్లాల్లో చెలరేగిన హింసతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ను బంద్ చేశారు.
► మణిపూర్‌లోని ఎనిమిది జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించారు. మరోవైపు కల్లోల స్థితిని అదుపు చేసేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఈ ఉదయం(గురువారం) హింస చెలరేగిన ప్రాంతంలో కవాతు నిర్వహించింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నాయి. ఇంటర్నెట్‌ను బంద్ చేయడంతో పాటు 144 సెక్షన్‌కు పక్డబందీగా అమలు చేస్తున్నారు అక్కడ. చురాచాంద్‌పూర్ జిల్లా రెవెన్యూ పరిధిలోని ఆస్తులు, ప్రాణాలకు ముప్పు ఉందని, శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. బయట వ్యక్తులను ఎవరినీ రానీయకుండా సంపూర్ణ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది.
► అలా మొదలై..
మెయితీలు తమను షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారం ఊపందుకోవడంతో.. గిరిజన సంఘాలు రంగంలోకి దిగాయి. మెయితీల డిమాండ్‌ను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ఈ క్రమంలో.. చురాచంద్ పూర్ జిల్లాలోని తొర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం) ‘గిరిజన సంఘీభావ యాత్ర’ను బుధవారం చేపట్టింది. యాభై వేల మందికి పైగా గిరిజనలు ఒకేచోట చేరి.. గిరిజన హక్కుల పరిరక్షణ నినాదాలు చేశారు. అయితే.. ఈ యాత్ర హింసకు దారి తీసింది. యాత్రలో పాల్గొన్న కొందరు గ్రామంలోని రోడ్లపై టైర్లు, ఇతర వస్తువులను తగలబెట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా.. ఉద్రిక్త పరిస్థితులను దారి తీసింది. దీంతో పోలీసులు లాఠీలకు, టియర్ గ్యాస్‌లకు పని చెప్పారు. అయితే ఇది మెయితీల పనేనని గిరిజన సంఘాలు, కాదు కుకీ గిరిజనుల పనేనని మెయితీలు ఆరోపించుకుంటున్నారు.
► మెయితీలు
మణిపూర్ కొండ, లోయ ప్రాంతాలతో రెండుగా విభజించబడింది. లోయ ప్రాంతంలో మెయితీలు, కొండ ప్రాంతాల్లో నాగా, కుకీ చిన్ మిజో, జో గిరిజన తెగలు జీవిస్తున్నాయి. మణిపూర్ జనాభాలో.. దాదాపు సగం జనాభా మెయితీ కమ్యూనిటీదే!. అయితే.. మయన్మార్, బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున అక్రమ వలసల కారణంగా.. తమ జీవనానికి ఇబ్బంది కలుగుతోందని మెయితీలు చెబుతున్నారు. ఈ క్రమంలో చొరబాటు దారులను కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసినా లాభం లేకుండా పోయింది. అయితే.. మణిపూర్ చట్టాల ప్రకారం లోయ ప్రాంతాల్లో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వాళ్లు జీవించడానికి. దీంతో వాళ్లను బలవంతంగా ఖాళీ చేయిస్తుండగా.. తమనూ గిరిజనుల్లో చేర్చాలని, ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, అలాగే.. కొండ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేయించాలని డిమాండ్‌కు దిగారు వాళ్లు.
► ఈనాటిది కాదు..
మెయితీ కమ్యూనిటీ డిమాండ్ దశాబ్దాల కాలం నాటిది. అయితే పదేళ్ల కిందట ఈ డిమాండ్ విషయంలో కీలక అడుగు పడింది. మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశం పరిశీలనకు అప్పటి ప్రభుత్వం మణిపూర్ అసెంబ్లీ హిల్స్ ఏరియాస్ కమిటీని ఏర్పాటు చేయగా.. అది సుదీర్ఘ పరిశీలనల తర్వాత మెయితీస్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం పాస్ చేసింది. దీంతో ఆ కమ్యూనిటీ భగ్గుమంది. ఈ అంశంపై మణిపూర్ హైకోర్టును ఆశ్రయించగా.. మెయితీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని నాలుగు వారాల్లోగా పరిశీలించాలని, అలాగే కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలంటూ ఆదేశించింది. దీంతో పరిస్థితులు అల్లర్లు హింసకు దారి తీశాయి.
► డీజీపీ స్పందన
కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే చిత్రాలు, విద్వేష ప్రసంగాలు, విద్వేష వీడియో సందేశాల ప్రసారం కోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నాయని మణిపూర్ హోం శాఖ ఒక లేఖలో పేర్కొంది. వదంతులు వ్యాపింపజేసేవారికి సోషల్ మీడియా ఒక సులభమైన సాధనంగా మారిందని, సాధారణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారని, ఇది మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుందని తెలిపింది. మరోవైపు బిష్ణుపూర్, చురాచంద్పూర్ జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా, అస్థిరంగా ఉందని డీజీపీ సీ డౌంగెల్ తెలిపారు. మరోవైపు ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సీఎం బీరెన్ పిలుపు ఇవ్వగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ పరిస్థితులపై బీరెన్‌తో ఫోన్‌లో చర్చించారు.
► మెయితీలు వర్సెస్ కుకీలు
మణిపూర్ కొండల్లోని భూములు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371సీ, మణిపూర్ భూ రెవెన్యూ & భూ సంస్కరణల (MLR & LR) చట్టం 1960లోని సెక్షన్ 158 ప్రకారం.. గిరిజనులకే చెందుతాయి. మెయితీలతో పాటు గిరిజనేతర వ్యక్తులకు బదిలీ చేయకూడదనే పాయింట్ మీద మెయితీల గిరిజన హోదా డిమాండ్‌ను కుకీ తెగ వ్యతిరేఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే గిరిజన హక్కుల పరిరక్షణ పేరిట చేపట్టిన యాత్రలో ముఖ్యభూమిక పోషించింది కూడా.
మరోవైపు మెయితీల జనాభా 1951 జనాభా లెక్కల ప్రకారం.. మణిపూర్ జనాభాలో 59 శాతం మెయితీలే ఉండేవాళ్లు. అయితే.. 2011 నాటికి ఆ జనాబా 44 శాతానికి పడిపోయింది. అయితే తాము గతంలోనే గిరిజనులుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నామని చెబుతున్నారు. 1891లో.. మెయితీలను అటవీ గిరిజనులుగా గుర్తించింది అప్పటి బ్రిటిష్‌రాజ్యం. ఆపై 1901లో ప్రధాన గిరిజనులుగా వాళ్లను రికార్డుల్లోకి ఎక్కించారు. తిరిగి 1931లో.. హిందూ గిరిజనులుగా గుర్తించారు. కానీ, 1950 నుంచి వాళ్లను గిరిజనులుగా పరిగనించడం లేదు. ఆ కారణం ప్రభుత్వాలకే తెలియాలని అంటున్నారు మెయితీలు.
ఇదీ చదవండి: అన్ని కోట్లు సంపాదించాలంటే.. ఎంత టైం పడుతుందో?
Comments
Please login to add a commentAdd a comment