![When Nehru and Tagore Turned Against Harmonium - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/nehru.gif.webp?itok=3Vm0W31c)
హార్మోనియం.. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్య పరికరం. ఇది నిజంగా భారత దేశానికి చెందినదేనా? అనే సందేహం చాలామందిలో దశాబ్దాలుగా ఉంది. అయితే కొందరు ఇది భారతీయులదేనని గాఢంగా నమ్ముతుంటారు. 1900ల ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్నప్పుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి హార్మోనియం అనువైనదా కాదా అనే చర్చ జరిగింది.
మహాత్మా గాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో పలువురు హార్మోనియం భారతీయులది కాదంటూ వ్యతిరేకించారు. 1940లో ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగ అధిపతి అందించిన కథనానికి స్పందనగా దాదాపు మూడు దశాబ్దాలపాటు ‘ఆకాశవాణి’లో హార్మోనియం నిషేధించారు. ఈ నిషేధం 1971లో పాక్షికంగా ఎత్తివేశారు. అనంతర కాలంలో ఈ నిషేధాన్ని పూర్తిగా తొలగించారు.
ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం పేటెంట్
హార్మోనియం 1700లలో ఐరోపాలో ఆవిర్భవించింది. అనేక మార్పులకు లోనైన తర్వాత ఇది భారతదేశానికి చేరువయ్యింది. దీని మొదటి నమూనాను కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ గాట్లీబ్ క్రాట్‌జెన్‌స్టెయిన్ రూపొందించారని చెబుతారు. దీని తరువాత హార్మోనియంలో అనేక మార్పులు వచ్చాయి. 1842లో అలెగ్జాండ్రే డెబెన్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం డిజైన్‌కు పేటెంట్ పొంది, దానికి 'హార్మోనియం' అని పేరు పెట్టారు. హార్మోనియంను 19వ శతాబ్దం చివరలో పాశ్చాత్య వ్యాపారులు, మిషనరీలు భారతదేశానికి తీసుకువచ్చారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం భారతీయ చేతి వాయిద్యంగా మారిన హార్మోనియంను 1875లో కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోష్ రూపొందించారు.
అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని..
1915 నాటికి భారతదేశం హార్మోనియంల రూపకల్పనలో అగ్రగామిగా మారింది. అలాగే ఈ వాయిద్యం భారతీయ సంగీతంలో అంతర్భాగంగా మారింది. హార్మోనియంలో 12 స్వరాలు, 22 శృతులను పలికించవచ్చని చెబుతారు. అయితే భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులలోని ఒక విభాగం హార్మోనియం అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని, అన్ని శాస్త్రీయ స్వరాలను పరిపూర్ణంగా పలికించే సామర్థ్యాన్ని కలిగి లేదని ఎత్తి చూపింది. దీని గురించి ప్రఖ్యాత హార్మోనియం ప్లేయర్ రవీంద్ర కటోటి మాట్లాడుతూ పరిమితి అనేది విశ్వవ్యాప్త వాస్తవం. ప్రతి స్వరానికి, ప్రతి పరికరానికి దాని పరిమితులు ఉంటాయన్నారు.
ఠాగూర్ వాదన ఇదే..
హార్మోనియం భారతీయమా కాదా, ఇది భారతీయ సంగీతానికి సరిపోతుందా లేదా అనే చర్చ నడుస్తున్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వాయిద్య పరికరం భారతీయతకు సరిపోదన్నారు. ఇది గమకాలను పలికించలేదన్నారు. ఈ నేపధ్యంలోనే ఆకాశవాణిలో హార్మోనియంను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక సాహితీవేత్త కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియోకి లేఖ రాశారు. ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగం అధిపతి జాన్ ఫోల్డ్స్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎంతో అవసరమైన మైక్రోటోన్‌ల విషయంలో హార్మోనియం మ్యూట్‌గా ఉందని తన కథనాలలో వివరించారు. కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్‌గా ఉన్న లియోనెల్ ఫీల్డెన్.. ఫోల్డ్స్ వాదనతో ఏకీభవించారు. దీంతో 1940, మార్చి 1న ఆల్ ఇండియా రేడియో హార్మోనియంను నిషేధించింది.
స్వాతంత్య్రానంతరం కూడా..
సంగీత విద్వాంసుడు అభిక్ మజుందార్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. కళా చరిత్రకారుడు ఆనంద్ కుమారస్వామి, స్వాతంత్ర్య సమరయోధునిగా జవహర్‌లాల్ నెహ్రూ కూడా హార్మోనియం భారతీయతకు చెందినది కాదన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వాయిద్య పరికరంపై నిషేధం కొనసాగిందని, సమాచార ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్, విద్వాంసుడైన గాయకుడు విఎన్ భత్‌ఖండే విద్యార్థి దీనికి కారణమని తెలిపారు.
ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి..
Comments
Please login to add a commentAdd a comment