కలలో రాక్షసులు కనిపిస్తున్నారా? | Dream may be demons? | Sakshi
Sakshi News home page

కలలో రాక్షసులు కనిపిస్తున్నారా?

Published Tue, Jan 21 2014 12:06 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

Dream may be demons?

హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యావర్తనం (ఆర్యుల భూభాగం) ఎక్కడ ఉండేదో మన దేశపటంలో నువ్వు చూశావు. అది బాల చంద్రాకారంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి ఇందుదేశమని పేరు వచ్చింది. ఇందు దేశమే  హిందూదేశమయింది.
 
రామాయణం పుట్టిన చాలాకాలానికి మహాభారతం పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు. ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబకలహమే భారతకథ. భారతంలో చెప్పిన కథలు, ధర్మాలు ఇన్నీ అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా ఉంటాయి. వీటి అన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహాగ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ ప్రియతమమైనది అయింది. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులే వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా  వాటి గురించి తెలుసుకోని పిల్లలు, ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు.
నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలోనుంచి
 
 
 కలలో రాక్షసులు కనిపిస్తున్నారా?
స్వప్నలిపి ...ఇదో కలల నిఘంటువు

 కలలు అనేవి తీసిపారేయదగినవి కాదని, వాటికంటూ నిర్దిష్టమైన అర్థం ఉందని కలలను లోతుగా అధ్యయనం చేసిన నిపుణులు అంటారు. వారు చెప్పే దాని ప్రకారం కల అంటే ఏమిటో కాదు...మన అంతః చేతనలోని వ్యక్తిగత ఉత్తరం. పదాలకు నిఘంటువు ఉన్నట్లే కలల అంతరార్థాలను తెలుసుకోవడానికి కూడా నిఘంటువు ఉంది. దాని ప్రకారం మీ కలకు అర్థం ఇది...
 
స్వప్న తాత్పర్యం
 మీకో దురలవాటు ఉంటుంది. సపోజ్... మద్యపానం అనుకోండి. ఆ వ్యసనం మిమ్మల్ని అన్ని రకాలుగా బాధ పెడుతుంది. మీలో అంతర్మథనం మొదలవుతుంది.
 
తాగడం మానేయాలని మొదటి రోజు అనుకుంటారు. రెండోరోజు మానేస్తారు. మూడోరోజు మాత్రం ముఖం మాడ్చేస్తారు.  ‘ఏదో మిస్ అయింది’ అనుకుంటారు. మళ్లీ మందు కొడతారు. మళ్లీ బాధపడతారు. మానాలనుకోవడం, మానలేకపోవడం ఎన్నోసార్లు జరుగుతుంటుంది.
 
మిమ్మల్ని కలలో వెంటాడుతున్న ఆ రాక్షసుడు ఎవరో కాదు... అలాంటి ఓ వ్యసనం! ఆ రాక్షసుడికి బలవుతారా? సంహరిస్తారా? అనేది మీ సంకల్పబలం మీద ఆధారపడి ఉంటుంది.
 
 పోస్ట్‌కార్డ్‌లు అమ్మేవాడు!
తెలిసిన వ్యక్తి- తెలియని విషయం
 
వయసులో ఉన్నప్పుడు మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు.
     
సన్నిహితులు, స్నేహితులు ‘ఆడి’ పేరుతో పిలిచేవారు.
     
తల్లి చనిపోయిన తరువాత వియన్నాలో పోస్ట్‌కార్డులు అమ్మి తన అవసరాలకు కావలసిన డబ్బు సంపాదించేవాడు.
     
చదువును హైస్కూల్‌తోనే ఆపేశాడు.
     
హిట్లర్ అనగానే జర్మనీ, జర్మనీ అనగానే హిట్లర్ గుర్తుకువస్తారు. కానీ హిట్లర్ పుట్టింది ఆస్ట్రియాలో!
     
హిట్లర్ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయింది.
     
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్ జర్మనీ సైన్యంలో పనిచేశాడు. తన  ధైర్యసాహసాలకు పురస్కారం కూడా లభించింది.
     
హిట్లర్ నిద్రలేమితో బాధపడేవాడు. కొన్ని సందర్భాల్లో పగలు నిద్ర పోతుండేవాడు.
     
ఆర్ట్ స్కూల్‌లో హిట్లర్ ప్రవేశ దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
     
హిట్లర్ మద్యం ముట్టేవాడు కాదు.
 
శాకాహారి.
     
హిట్లర్‌కు బ్లేడ్లు అంటే భయం.
 
రక్తతులాభారం!
 ఆదర్శం

 పువ్వులు, కరెన్సీ, బెల్లం...రకరకాల తులాభారాల గురించి మనం విని ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలో ‘రక్తతులాభారం’ పేరు కూడా చేర్చవచ్చు.
 
ఇదేమి తులాభారం? అని ఆశ్చర్యపడిపోతున్నారా? అయితే మీరు నందా... సుదీప్ కుమార్ నందా గురించి తెలుసుకోవాల్సిందే. అన్నదానం మహాదానం...అని మనం అనుకుంటాంగానీ గుజరాత్ ఐఏయస్ అధికారి సుదీప్ కుమార్ నందాకు మాత్రం రక్తదానం మహాదానం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రక్తదానం చేయడమే కాదు, దాని ఆవశ్యకతను గురించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాడు.
 
రక్తదానం గురించి బొత్తిగా తెలియని వారు కూడా సుదీప్ మాటల ప్రభావంతో ఆయన బాటలో నడవడం ప్రారంభించారు.
 
తాజా సంగతి ఏమిటంటే... రక్తదానం విషయంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన సుదీప్ కుమార్‌ను ఆయన అభిమానులు సరికొత్త రీతిలో సన్మానించారు. గుజరాత్‌లోని కల్ల గ్రామంలోని 513 మంది 79 లీటర్ల రక్తాన్ని దానంగా ఇచ్చి ‘రక్త తులా సన్మాన్’ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement