ఒడిశా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటన.. భారీ విషాదాన్ని నింపేదిగా కనిపిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సుమారు 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగానే ఉండడం.. ఇంకా బోగీల్లో వాళ్లను బయటకు తీసే చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చు. ఒకేసారి మూడు రైళ్లు ఢీ కొట్టడంతో.. అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు పలువురు. కానీ, స్వాతంత్ర భారత దేశ చరిత్రలో ఇంతకన్నా ఘోరమైన ప్రమాదాలు చాలానే చోటుచేసుకున్నాయి.
👉 దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్‌లో జరిగింది. తుపాను సమయంలో రైలు బాగ్‌మతి నది బ్రిడ్జ్ దాగుతుండగా బోగీలు నదిలో పడిపోయాయి. రెండు రోజుల తర్వాత.. 200 దాకా మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల తర్వాత 235 మంది మరణించారని, ముగ్గురి జాడ తెలియరాలేదని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. కానీ, వందల మంది తమ వాళ్ల జాడ లేదంటూ మీడియా ముందుకు వచ్చారు. నది ఉధృతికి వాళ్లంతా కొట్టుకుపోయి ఉండొచ్చనే భావించారంతా. ఈ ఘటనలో సుమారు ఏడు నుంచి 800 మంది మరణించి ఉండొచ్చని అంచనా.
1988లో దక్షిణ భారత్లోని క్విలోన్ వద్ద ఓ సరస్సులో రైలు భోగీలు పడిపోయాయి. ఈ ఘటనలో 106 మంది చనిపోయారు.
👉 ఆగస్ట్ 20, 1995న ఫిరోజాబాద్ సమీపంలో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది. ఆఘటనలో దాదాపు 358 మంది దాక ప్రాణాలు కోల్పోయారు. దీన్ని భారతీయ రైల్వేస్.. రెండవ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా పరిగణించింది. ఫిరోజాబాద్ వద్ద కాళింది రైలు నీల్‌గై(ఒకరకం జంతువు)ను ఢీ కొట్టింది. ఆపై అది బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుకు సాగలేదు. ఈలోపు సిగ్నలింగ్‌వ్యవస్థలో లోపంతో మరో రైలు అదే పట్టాలపై దూసుకొచ్చింది. కాళింది ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీ కొట్టడంతో.. 358 మంది నిద్రలోనే మరణించారు. కానీ, ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 400 దాకా ఉండొచ్చనేది అంచనా.
నవంబర్ 26, 1998న జమ్ము తావి-సీల్దా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం. పంజాబ్‌లోని ఖన్నాలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్ గోల్డెన్ టెంపుల్ మెయిల్‌ని జమ్ము తావి సీల్దా ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో సుమారు 212 మంది మరణించారు.
👉 ఆగస్ట్ 2, 1999న నార్త్ ఫ్రాంటియర్ రైల్వేకతిహార్ డివిజన్‌లోని గైసల్ స్టేషన్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. బహ్మపుత్ర మెయిల్, అవధ్ ఎక్స్‌ప్రెస్ ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 285 మందికి పైగా మరణించగా 300 మందికి పైగా గాయప్డడారు. కానీ బాధితుల్లో చాలామంది ఆర్మీ, బీఎస్‌ఎస్ లేదా సీఆర్పీఎఫ్ సిబ్బందే ఉండటం బాధకరం.
👉 సెప్టెంబరు 9, 2002న హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రఫీగంజ్‌లోని ధావే నది వంతెనపై నుంచి పట్టాలు తప్పడంతో 140 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకు ఉగ్రవాద విధ్వంసమే కారణమని ఆరోపణలు వచ్చాయి.
👉 డిసెంబర్ 23, 1964న రామేశ్వరం తుఫాను కారణంగా పాంబన్-ధనుస్కోడి ప్యాసింజర్ రైలు కొట్టుకుపోయింది. అందులో ఉన్న 126 మంది ప్రయాణికులు మరణించారు.
👉 మే 28, 2010న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ముంబైకి వెళ్లే ఆ రైలు ఝర్‌గ్రామ్ సమీపంలో పట్టాలు తప్పింది, ఆపై ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ ఘటనలో 148 మంది ప్రయాణికులు మరణించారు.
👉 నవంబర్ 20, 2016న కాన్పూర్‌కు సుమారు 60 కి.మీ దూరంలో పుఖ్రాయాన్ వద్ద ఇండోర్ రాజేంద్ర ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో సుమారు 14 కోచ్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో ఈ ఘటనలో 152 మంది ప్రాణాలు కోల్పోగా, 260 మంది తీవ్రంగా గాయపడ్డారు.
(చదవండి: నిమిషాల వ్యవధిలోనే.. మూడు రైళ్లు..)
Comments
Please login to add a commentAdd a comment