ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బీహార్‌లోని మోతిహర జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. కాగా మృతుడు చికనీ గ్రామానికి చెందిన భూలన్ పటేల్ పెద్ద కుమారుడు రాజా కుమార్ అని చెబుతున్నారు. మృతుడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడని, ఈ పనుల కోసమే వేరే ప్రాంతం వెళ్లాడని సమాచారం. ఇదే గ్రామానికి చెందిన 9మంది రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరు స్వయంగా ఫోను చేసి, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా రాజా కుమార్ మరణవార్త తెలియగానే గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లి, భార్యల రోదనలు మిన్నంటాయి. రాజా కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే రాజా కుమార్ మృతదేహం ఇంకా గ్రామానికి చేరుకోలేదు.
మృతదేహాన్ని గ్రామం వరకూ తీసుకురావాలంటే అంబులెన్స్ డ్రైవర్ రూ. 45 వేలు అడుగుతున్నాడని మృతుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజా కుమార్ తల్లి మాట్లాడుతూ తమ కుటుంబ బాధ్యత రాజానే చూసుకుంటున్నాడని తెలిపారు. కేరళలో పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడన్నారు. రూ. 45 వేలు చెల్లించి కుమారుని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేంతటి స్థోమత తమకు లేదని ఆమె వాపోయింది. మృతుని తండ్రి భవన్ పటేల్ మాట్లాడుతూ తమ కుమారుని మృతదేహన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు గ్రామస్తులు చందాలు సేకరిస్తున్నారన్నారు.
ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 288కి చేరింది. 900 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా ఎన్డీఆర్‌ఎఫ్, రైల్వే, ఇతర శాఖల సిబ్బంది క్రేన్లు, బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్ల ఇంజిన్ డ్రైవర్లు, గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఘటనలో గూడ్స్ రైలు డ్రైవర్, గార్డుకు ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment