● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. వడదెబ్బతో అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు వచ్చే రోగులకు మందులు, సైలెన్ బాటిళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి వనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న డీఆర్డీవో విజయలక్ష్మిని అభినందించారు. తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్టీల్ వాటర్ బాటిళ్లను కలెక్టర్ అధికారులకు అందజేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో భాగంగా స్టీల్ బాటిళ్లు వాడకాన్ని ప్రోత్సహించిన అధికారులను అభినందించారు.
విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు
ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. తానూరు మండలం బోరిగామ గ్రామంలో రెవెన్యూ ఉద్యోగిపై దాడి ఘటనను ఖండించారు. ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.