నందిపేట్(ఆర్మూర్): సుపారీ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.. పలు కేసుల్లో అత్యంత వివాదాస్పదుడు నందిపేట మండలం లక్కంపల్లి తాజామాజీ సర్పంచు సుమలత భర్త మూడ మహేందర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరుపొందిన ఆయన శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పోస్టుమా ర్టం నిర్వహించడంతో మహేందర్‌ది హత్యా ? ఆత్మహత్యా ? అనుమానాలతో చర్చనీయాంశమైంది. గత నెల 22న ఇద్దరు స్నేహితులు, ఇద్దరు పోలీసు శాఖకు చెందిన వారితో కలిసి గోవాకు వెళ్లిన మహేందర్ అక్కడ నిషేధిత డ్రగ్స్ అతిగా తీసుకుని పక్షవాతానికి గురైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఆయన భార్య మరుసటి రోజు గోవాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి ఆస్పత్రిలో నాలుగు రోజుల చికిత్స అనంతరం ఒక పోలీస్ అధికారి సహాయంతో హైదారాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరిన మహేందర్ మృతి చెందాడు. కాగా ఆయనకు పక్షవాతం వచ్చిన విషయాన్ని, చివరికి చనిపోయిన మూడు గంటల వరకు ఎందుకు ఎవరికీ తెలియనీయలేదని, గుండె పోటుతో మరణిస్తే ఎందుకు పోస్టు మార్టం చేస్తారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భార్య ఫిర్యాదు..
గోవాలో మెడికల్ లీగల్ కేసుగా నమోదైనందున ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మహేందర్ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు నందిపేట ఎస్సై రాహుల్ తెలిపారు. ఫిట్స్‌తో పాటు గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శనివారం స్వగ్రామంలో జరిగిన మహేందర్ అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పలువురు తాజా మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
స్టేటస్‌లో ఫొటోలు..
ఓ వైపు పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు మహేందర్ ఫోన్ స్టేటస్‌లో ప్రతిరోజు గోవాలో తిరుగుతున్నట్లు ఆయన ఫొటోలు దర్శన మిచ్చాయి. చివరికి ఆయన చనిపోయిన రోజు కూడా ఉదయం 10.36 గంటలకు స్టేటస్‌లో గోవా బీచ్ ఫొటోలు కనిపించాయి. మహేందర్ మృతి ఘటన వెనుక రహస్యాలను మరుగు పర్చడానికే ఇలా స్టేటస్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసి ఉంటారని అంటున్నారు. గోవాలో నిషేధిత డ్రగ్స్ స్వయంగా తీసుకున్నాడా.. అతనికి ఉన్న క్రిమినల్ నేపథ్యం వెనుక సూత్రధారులెవరైనా బలవంతంగా ఎక్కువ డోసులు ఇచ్చారా అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment