
పగలు భానుడి ప్రతాపం.. రాత్రి చలి తీవ్రత
అత్యధికంగా మెండోరాలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నిజామాబాద్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనే అత్యధికంగా మెండోరాలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సీజన్‌లో జిల్లాలోనూ ఇదే అత్యధికం. ఈ వేసవిలో మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మార్చి రెండో వారంలోనే 40 డిగ్రీలకు చేరుకుంటే.. ఏప్రిల్ చివరి వారం, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అదే సమయంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. వేకువజామున స్వల్పంగా మంచు పడుతూ చలి పెడుతోంది. శనివారం సగటు ఉష్ణోగ్రతలు 37.2(గరిష్టం), 20.8(కనిష్టం) డిగ్రీలుగా నమోదైంది. ఎండ వేడికి ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీంతో రోడ్లపై జన సందడి తగ్గింది. దుకాణాలు పగటిపూట బంద్ చేసి సాయంత్రం వేళ తెరుస్తున్నారు. – సుభాష్‌నగర్