ప్రతి గుంటకు నీరందాలి
● పంటలు గట్టెక్కేలా చర్యలు తీసుకోండి
● ఇరిగేషన్ అధికారులతో బోధన్
ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రధాన కాలువ పరిధిలోని ప్రతి గుంటకు సాగు నీరు అందించి, పంటలు గట్టెక్కేలా చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఉమ్మడి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. గుల్‌దస్తా రెస్ట్ హౌస్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ సీఈలు శ్రీనివాస్, మధుసూదన్, ఎస్‌ఈలు, డీఈఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. చివరి ఆయకట్టు గట్టెక్కేవరకు నీటిని విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు నీరు వృథా కాకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలను పూర్తిస్థాయిలో గట్టెక్కిస్తామని, నీటి కోసం రైతులు ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, నిజాంసాగర్ నీటిపారుదలశాఖ ఈఈ సోలోమాన్ తదితరులు పాల్గొన్నారు.
చివరాయకట్టు వరకు నీరు
బోధన్/ఎడపల్లి: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతమైన డి–28 కాలువ కింద పంటలకు నీరందించేందుకు చర్యలు చేపట్టామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సాలూర మండలంలోని సాలూర క్యాంప్, జాడిజమాల్‌పూర్, బోధన్ మండలంలోని పెగడాపల్లి గ్రామాల శివారులో డి–28/14 కాలువలో నీటి పారకం, పంటల పరిస్థితిని, ఎడపల్లి మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువ ఆయకట్టును శనివారం ఆయన పరిశీలించారు. ఆయాగ్రామాల్లో రైతులతో మాట్లాడారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోకుండా నీరందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 53 వేల ఎకరాలు, నిజాంసాగర్ డి–46 కాలువ కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు, నీరు వృథా పోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరా గడువు ఈ నెల 3తో ముగియనుందని, మరి కొన్ని రోజులు పెంచాలని రైతులు ఎమ్మెల్యేను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ కమిషన్ స భ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు నాగేశ్వర్‌రావు, అల్లె రమేశ్, చిద్రపు అశోక్, నరేందర్‌రెడ్డి, సుందర్‌రాజ్ తదితరులు ఉన్నారు.
ప్రతి గుంటకు నీరందాలి
Comments
Please login to add a commentAdd a comment