Children's Day 2020 Special: 'Nihal Tammana' Introducing Recycle My Battery - Sakshi
Sakshi News home page

భూమాతకు మేలు చేకూర్చే కాన్సెప్ట్‌తో

Published Fri, Nov 13 2020 2:23 PM | Last Updated on Tue, Nov 17 2020 6:04 PM

Children Day Special Story : Nihaar of New Jersey, USA - Sakshi

నిహాల్‌ తమన్నా.. 11 ఏళ్ల కుర్రాడు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ తెలుగు కుటుంబం. నేపథ్యం సంగతి పక్కనబెడితే.. ఈ బుడతడు కాస్తా సీఈవోగా మారిపోయాడు. వ్యాపారం చేయడమొక్కటే లక్ష్యం కాదు, అది పర్యావరణానికి, భూమాతకు మేలు చేకూర్చే కాన్సెప్ట్‌తో ముందుకొచ్చాడు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక వన్‌ ఇన్‌ మిలియన్‌ అవార్డు అందుకున్నాడు. న్యూజెర్సీలో అయిదో తరగతి చదువుతున్న నిహాల్‌ కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన వారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో  కుర్రాడు మిహిర్‌ కూడా నిహాల్‌కు జత కలిశాడు.

ప్రస్తుత జీవన విధానంలో ప్రతీ చోట బ్యాటరీలు వాడుతున్నాం. ఒక్క అమెరికాలో ప్రతి ఏడాది దాదాపు 300 కోట్ల బ్యాటరీలు వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య వెయ్యి కోట్ల కంటే ఎక్కువ. మొబైల్‌ నుంచి ఇన్వర్టర్‌ దాకా, షేవర్‌ నుంచి కెమెరా దాకా.. ఇంట్లో వాడే సగం వస్తువులు బ్యాటరీతోనే పని చేస్తున్నాయి. అయితే బ్యాటరీ కెపాసిటీ పూర్తికాగానే దాన్ని చెత్తబుట్టలో వేసేస్తున్నాం. ఇలా వాడే పారేసిన బ్యాటరీల వల్ల భూమికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ హాని గురించి తెలుసుకున్న నిహాల్‌ తమన్నా, మిహిర్‌ ఇద్దరు తమ వంతుగా ఏమైనా చేయాలనుకున్నారు. 

బ్యాటరీల వల్ల ముప్పును నివారించడానికి కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. వీరి ప్రధాన లక్ష్యం వాడిపారేసిన బ్యాటరీ భూమిలోకి చేరకూడదు. ఈ విషయంలో ప్రజలను చైతన్యమంతం చేయడం లక్ష్యంగా www.recyclemybattery.org అనే వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తున్న ఈ సంస్థ ప్రధానంగా బ్యాటరీల పునర్వినియోగం కోసం పని చేస్తోంది. మొదటి ఏడాదిలోనే 45 మంది విద్యార్థులను సంస్థలో భాగస్వామ్యం చేశాడు నిహాల్‌. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది పెద్దవాళ్లకు, లక్ష మంది విద్యార్థులకు నేరుగా బ్యాటరీ పునర్వినియోగం మీద అవగాహన కల్పించారు.

స్కూళ్లు, ఆఫీసులు, లైబ్రరీలు వంటి పలు చోట్ల పాత, పాడైన బ్యాటరీలు సేకరించేందుకు 200 బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 38 వేల బ్యాటరీలను సేకరించి వాటిని రీసైక్లింగ్‌ చేశారు. అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల్లో, ముఖ్య నగరాల్లో బ్యాటరీలను సేకరించిందుకు స్నేహితుల సహకారం తీసుకుంటున్నారు ఈ చిన్నారులు. నిహాల్‌, మిహిర్‌ వీరిద్దరూ చేస్తున్న ఈ పనికి ఐటీ సర్వ్‌ అలియన్స్‌ తమ మద్దతు పలికింది. వీళ్ల చేస్తున్న మంచి పనికి ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి.

నిహాల్‌కు నేషనల్ వేస్ట్ రీసైక్లింగ్ అసోసియేషన్ అవార్డు,  న్యూజెర్సీ స్టేట్ రీసైక్లింగ్ అవార్డు,  గ్లోబల్ కిడ్స్ అచీవర్ అవార్డులు లభించాయి. నిహాల్‌ చేస్తున్న పర్యావరణకృషికి గాను 2000 సంవత్సరానికి వన్‌ ఇన్‌ మిలియన్‌ అవార్డు లభించింది. ఈ భూమిని కాలుష్యం నుంచి నేను కాపాడినప్పుడు మీరు కూడా ఆ పని చేయగలరన్న నినాదంతో ముందుకెళ్తున్న నిహాల్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, పర్యావరణానికి మేలు చేసే మరిన్ని పనులు చేయాలని ఐటీ సర్వ్‌ అలయన్స్‌ అభిలషించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement