వాషింగ్టన్: శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి దూకి 16 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వంతెన వద్ద బాలుడి సైకిల్, మొబైల్ ఫోన్, బ్యాగు కనిపించినట్లు తల్లిదండ్రులు, అమెరికా కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.58 నిమిషాలకు గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి నదిలోకి ఎవరో దూకినట్లు అందిన సమాచారం మేరకు కోస్టల్ గార్డ్స్ సుమారు రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో బాలుడు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలుడు 12వ తరగతి చదువుతున్నట్లు కోస్టల్ గార్డ్ అధికారులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకునేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన వారు గోల్డెన్ గేట్ పైనుంచి దూకటం ఇది నాలుగో సంఘటనగా తెలిపారు కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భుటోరియా. బ్రిడ్జ్ రైల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్యలను నిరోధించే విషయంలో పని చేస్తోంది. గతేడాది ఇక్కడ 25 మంది ఆత్మహత్య చేసుకున్నారని, 1937లో వంతెన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 2,000 ఆత్మహత్య ఘటనలు జరిగినట్లు వెల్లడించింది.
మరోవైపు.. బ్రిడ్జ్‌పై ఆత్మహత్యలను నిరోధించేందుకు ఇరువైపులా 20 అడుగుల ఎత్తులో ఇనుప కంచెను కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరిలోనే పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ వ్యయం పెరగడంతో జాప్యం జరిగింది.
ఇదీ చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే!
Comments
Please login to add a commentAdd a comment