
ఈడుపుగల్లులో రోడ్డు షో చేస్తున్న చంద్రబాబు
పటమట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఆసాంతం ఊకదంపుడు ఉపన్యాసాలు.. పరనిందగానే సాగింది. తొలుత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు షో సైతం జనం లేక వెలవెలబోయింది. అనంతరం పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్ కృష్ణా జిల్లాలో సాగింది. పెడన నియోజవకర్గం గూడూరులో రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటంతో తెలుగుతమ్ముళ్లు కేరింతలు కొడుతుండగా కొల్లు రవీంద్ర అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులకు తొపులాటలు జరిగాయి. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభ సైతం వెలవెలబోయింది.
ఆయా ప్రాంతాల్లోని సభల్లో చంద్రబాబు ప్రసంగం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రం భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, కేసులతో టీడీపీ కార్యకర్తలు, నాయకులను భయపెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తాము జంకబోమని తెలిపారు. ప్రజల నమ్మకం జగన్‌మోహన్‌రెడ్డి అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారని కానీ ప్రజల నమ్మకం టీడీపీయేనని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన పర్యటనకు చంద్రబాబు ఆలస్యంగా రావటంపై అటు కార్యకర్తలు ఇటు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో బహిరంగ సమావేశం అనంతరం ఆయన పామర్రు నియోజవకర్గంలో బస చేయటానికి వెళ్లారు.