చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్
కోడూరు/విజయవాడస్పోర్ట్స్: చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసిన బాలుడిని పోలీసులు వెంబడిస్తున్నారనే సమాచారంతో ఓ బాలిక డ్రైనేజీలో పడేసిన ఘటన కోడూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కోడూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక అవనిగడ్డలోని ఓ ప్రయివేటు మెడికల్ షాపులో గుమస్తాగా పని చేస్తుంది. సదరు బాలిక గురువారం ఉదయం విజయవాడ గవర్నర్‌పేటలోని పాత జీజీహెచ్ వైద్యశాలకు వెళ్లింది. పాత గవర్నమెంట్‌లో ఏలూరుకు చెందిన ఓ గృహిణి పాత ప్రభుత్వాస్పత్రిలో చిక్సిత పొందుతోంది. ఆమె రెండేళ్ల కుమారుడు బషీర్ అక్కడే ఉంటున్నాడు. ఆమె భర్త బయటకు వెళ్లిన సమయంలో కోడూరుకు చెందిన బాలిక చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి కిడ్నాప్ చేసింది. బాలుడు అదృశ్యమైన విషయాన్ని తల్లిదండ్రులు గవర్నర్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా బాలుడిని కిడ్నాప్ చేసింది కోడూరు బాలికగా గుర్తించారు.
అవనిగడ్డ నుంచి బాలికపై నిఘా
బాలిక కిడ్నాప్ చేసిన బాలుడిని సంచిలో పెట్టుకొని కోడూరుకు తీసుకువచ్చింది. ఘటన గురించి ముందుగానే తెలుసుకున్న అవనిగడ్డ సర్కిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అవనిగడ్డ నుంచే సీఐ యువకుమార్, ఎస్‌ఐ చాణిక్యలు సిబ్బందితో కలిసి నిఘా పెట్టి, బాలికను అనుసరించారు. దీన్ని గమనించిన మైనర్ బాలిక గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అహరించిన బాలుడిని కోడూరు ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడేసింది. గోనె సంచిని అక్కడే పడేసింది. ఆమె వెనుకనే ఉన్న పోలీసులు బాలుడిని రక్షించగా, ఆ బాలిక కోసం వెతకగా అక్కడ నుంచి అదృశ్యమైంది. విజయవాడ, కోడూరుకు చెందిన 20 మంది పోలీసులు నిందితురాలి ఆచూకీ కోసం గురువారం అర్ధరాత్రి కోడూరును జల్లెడపట్టారు. బాలిక ఫోన్ నంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఆచూకీ కనిపెట్టారు. బాలుడిని డ్రైనేజీలో పడేసిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలోనే బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
17 ఏళ్ల వయసులోనే రెండు పెళ్లిళ్లు
బాలుడిని అపహరించిన బాలిక 17 ఏళ్ల వయస్సులోనే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి పెళ్లి చేసుకొని భర్తను తీవ్ర ఇబ్బందులు పెట్టి విడాకులు ఇచ్చే సమయంలో భారీ మొత్తం నగదును డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆరునెలల క్రితం మరో వివాహం చేసుకొని ప్రస్తుతం ఆ భర్తను కూడా వేధింపులకు గురి చేసి, డబ్బులు డిమాండ్ చేసి విడిపోయినట్లు సమాచారం.
బాలుడిని విక్రయించాలనే..
బాలుడిని విక్రయించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే నిందితురాలు ఈ దారుణానికి పాల్పడిందని గవర్నర్‌పేట పోలీసుల వెల్లడించారు. కమిషనరేట్ కార్యాలయంలో బాలుడిని ఆమె తల్లికి పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు శుక్రవారం అందించారు. కేసు ఛేదించిన పోలీసులను సీపీ అభినందించారు.
విజయవాడలో బాలుడిని అపహరించిన బాలిక
కోడూరులో హైడ్రామా
చిన్నారిని కాపాడిన పోలీసులు
నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment