వైద్యం వికటించి గర్భిణి మృతి
● ఆందోళన వ్యక్తం చేసిన బంధువులు ● ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం ● నిండు గర్భిణి మరణిస్తే రేటు కడతారా
మచిలీపట్నం టౌన్: వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని రామానాయుడు పేట సోషల్‌క్లబ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి నాగదుర్గ(24) ఈ ఆస్పత్రిలో వైద్యం పొందుతోంది.
ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. పలు పరీక్షలు చేయాలని పేర్కొంటూ రూ.700 కట్టించుకుని మధ్యాహ్నం సమయంలో వైద్యురాలు నాగదుర్గకు ఇంజక్షన్ చేశారు. కొంతసేపటికి ఆమె ఆస్వస్థతకు గురి కావడంతో ఐసీయూలో చికిత్స అందించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో నాగదుర్గ మరణించిందని వైద్యురాలు పేర్కొనంతో బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. వైద్యురాలి నిర్లక్ష్యంతో నాగదుర్గ చనిపోయిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆందోళన వ్యక్తం చేసిన వారు వైద్యురాలి గదిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. డాక్టర్ చేసిన ఇంజక్షన్ వికటించి నాగదుర్గ చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క నిండుగర్భిణి చనిపోయిందని బాధతో ఉన్న బంధువులను సెటిల్‌మెంట్ చేసుకుందామని రావాలంటూ వైద్యురాలి భర్త, వైద్యుడితోపాటు మరికొందరు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నిండు గర్భిణి మృతికి కారణమైన ఆస్పత్రిని సీజ్ చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని కోరుతున్నారు.
వైద్యం వికటించి గర్భిణి మృతి
Comments
Please login to add a commentAdd a comment