ముగిసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా పోటీలు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రెండో రోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. క్రికెట్, టగ్‌వార్, మ్యూజికల్ చైర్, వాలీబాల్, 100 మీటర్ల రన్నింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జట్లు తలపడ్డాయి. 100 మీటర్ల రన్నింగ్ రేస్ పురుషుల 50 ఏళ్ల లోపు విభాగంలో శ్రీధర్, విజయ్‌చంద్ర, 60 ఏళ్ల లోపు విభాగంలో కె.ఇ.శ్యామ్, సత్యకుమార్, 60 ఏళ్లు పైబడిన విభాగంలో రామాంజనేయులు, గద్దె రామ్మోహన్, 100 కేజీల బరువు కేటగిరీలో కె.శ్రీకాంత్, విజయ్‌కుమార్, మహిళల షాట్‌పుట్‌లో పి.సింధూరరెడ్డి, ఆర్.మాధవిరెడ్డి, పురుషుల 60 ఏళ్ల లోపు విభాగంలో విజయ్‌కుమార్, ఆదిరెడ్డి వాసు, 60 ఏళ్లు పైబడిన విభాగంలో కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ వరుసగా విన్నర్, రన్నర్‌లుగా నిలిచారు. త్రోబాల్, వాలీబాల్ మహిళల విభాగంలో బి.అఖిలప్రియరెడ్డి–వంగలపూడి అనిత జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. మ్యూజికల్ చైర్ పోటీల్లో మిర్యాల శిరీష(ప్రథమ), ఎస్.సవిత(ద్వితీయ), పి.సింధూరరెడ్డి(తృతీయ) సత్తా చాటారు. మిగిలిన క్రీడాంశాల్లో పోటీలు ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రి వరకు కొనసాగాయి.
నేడు బహుమతి ప్రదానం..
పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయని, విజేతలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గురువారం ట్రోఫీలు, మెడల్స్ అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడించారు. శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా, స్పోర్ట్స్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల డీఎస్‌డీవోలు ఎస్.ఏ.అజీజ్, జాన్సీ పోటీలను పర్యవేక్షించారు. క్రీడా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
ముగిసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు
Comments
Please login to add a commentAdd a comment