‘ఓపీ’క నశించి.. నీరసిస్తున్న రోగులు
పేదోళ్లకు పెద్దాస్పత్రి అంటే పెద్దన్నలాంటిది. ఎలాంటి వ్యాధియైనా వారికి కనిపించే ఏకై క దిక్కు అదే. అలాంటి ఆస్పత్రిలో వైద్యం మిథ్యగా మారుతోంది. కనీస సౌకర్యాలు కనుమరుగవుతున్నాయి. చికిత్స కావాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రిలో సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఏసీ గదులు దాటి బయటకు రాకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్కడ చూసినా రోగులు బారులు తీరి క్యూలైన్‌లలో దర్శనం ఇస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఏసీ గదులను వీడటం లేదు. దీంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రిలో సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి.
పర్యవేక్షణేది..
రోగులకు అందుతున్న సేవలను నిత్యం రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాల్సి ఉంది. ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.. అవసరమైతే సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఆర్‌ఎంఓలు ఏసీ గదులకే పరిమితం కావడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. అంతేకాదు సమయం దాటిన తర్వాత మహాప్రస్థానం వాహనం కోసం మాట్లాడేందుకు ఆర్‌ఎంఓలు ఫోన్‌లు ఎత్తడం లేదు. దీంతో సూపరింటెండెంట్‌కు ఫోన్‌చేస్తే ఆయన స్పందించాల్సి వస్తోంది. ఆర్‌ఎంఓల పనితీరుపై ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నా, వారిలో చలనం మాత్రం రావడం లేదు. రోగుల కష్టాలు వారికి పట్టడం లేదు.
అరకొరగా మందులు..
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పక్షవాతం, గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగులు నిత్యం 300 నుంచి 400 మందికి పైగా వస్తుంటారు. వారికి గతంలో వైద్య పరీక్షలు చేసి, 30 రోజులకు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు వారం నుంచి 15 రోజులకే ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. దీంతో నెలలో రెండు సార్లు ఆస్పత్రికి రావాల్సి వస్తోందని, చార్జీలకే చాలా వ్యయం అవుతోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దీర్ఘకాలిక రోగులకు నెలకు మందులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
విజయవాడ జీజీహెచ్‌లో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎక్కడ చూసినా క్యూలైన్‌లలో నిరీక్షణే దీర్ఘకాలిక రోగులకు మందులు వారం నుంచి 15 రోజులకే ఇస్తున్న వైనం ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
ఎక్కడ చూసినా క్యూలైన్‌లే..
జీజీహెచ్‌కి వచ్చిన రోగులు ఓపీ తీసుకునే వద్ద నుంచి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మందులు తీసుకునే వరకూ ప్రతిచోట క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిందే. ఓపీ కోసం కనీసం 30 నిమిషాలు క్యూలో ఉంటున్నారు. ఒక్కోసారి 45 నిమిషాలకు పైగానే పడుతోంది. అక్కడి నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వద్దకు వెళితే అక్కడ గంటపాటు క్యూలో ఉండాల్సిందే. అక్కడి నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వెళ్తే మరో 30 నుంచి 45 నిమిషాలు, మందులు కోసం 30 నిమిషాలు.. ఇలా ప్రతిచోట క్యూలైన్‌లు ఉండటంతో రోగులు నీరసించి పోతున్నారు. ప్రస్తుతం ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాల వద్ద పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది.
పెద్దాస్పత్రిలో పేదోళ్ల కష్టాలు
పెద్దాస్పత్రిలో పేదోళ్ల కష్టాలు