
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
గూడూరు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ అరండల్ పేటకు చెందిన సంరెడ్డి ఫణి(34) పామర్రులోని వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. ఫణి పనిమీద పామర్రు నుంచి ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వెళ్తున్నాడు. అదే సమయంలో పాలకొల్లుకు చెందిన పిన్నంరెడ్డి రామారావు కుటుంబ సభ్యులు విజయవాడలో కార్యక్రమానికి హాజరై తిరిగి మచిలీపట్నం జాతీయ రహదారి గుండా పాలకొల్లు వెళ్తున్నారు. గూడూరు మండలం చిట్టి గూడూరు దగ్గరలో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొడుతూ అమాంతం రోడ్డుపక్కనున్న కాల్వలోకి పల్టీలు కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఫణికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున పిన్నంరెడ్డి రామారావుకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. రామారావు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు దామోదర్, మనవరాలు జొన్నల బేబిలకు స్వల్ప గాయా లయ్యాయి. క్షతగాత్రులను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫణిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. గూడూరు ఎస్‌ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం