
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ధర్నా చేశారు. నర్సింగరావు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సబ్ స్టేషన్ ఆపరేటర్లు, వాచ్‌మన్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బ్రేక్ డౌన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడర్లు, స్టోర్స్ హమాలీలు, ఎస్పీఎం తదితర క్యాడర్లలో ఎంతో మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గుర వుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ – ఔట్‌సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయా లని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, షిప్ట్ ఆపరేటర్లకు సమాన వేతనాలు ఇవ్వాలని, బిల్ కలెక్షన్ ఏజెంట్లకు, మీటర్ రీడర్లకు, ఎస్పీం కార్మికులకు, స్టోర్ హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ధర్నా అనంతరం వినతిపత్రాన్ని ట్రాన్స్‌కో డైరెక్టర్ హెచ్‌ఆర్ కె.లింగమూర్తికి అందజేశారు. సీఐటీయూరాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జె.రాజశేఖర్, కోశాధికారి ఎస్.విజయరావు, పి.అనీల్ కుమార్, నాగరాజు, డి.సూరిబాబు, కె.దుర్గారావు పాల్గొన్నారు.