ముఖ్యమంత్రి గృహ ప్రవేశం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధికారిక భవనంలో గృహ ప్రవేశం చేశారు. గురువారం ఉదయం 10.47 గంటల సుముహూర్తంలో కుటుంబ సమేతంగా ఈ భవనంలోనికి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నూతన భవనంలో ప్రత్యేక హోమాదులు నిర్వహించారు. పూరీ నుంచి విచ్చేసిన ప్రత్యేక పురోహిత బృందం ఈ పూజాదులు నిర్వహించారు. స్థానిక రాజ్ భవన్, ఏజీ స్క్వేర్ మధ్య నగరం నడి బొడ్డున ముఖ్యమంత్రి అధికారిక భవనం రెండంతస్తుల భవన సముదాయం నెలకొని ఉంది.
25 ఏళ్ల తర్వాత..
దాదాపు 25 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అధికారిక భవనం కొత్త శోభని సంతరించుకోవడం విశేషం. సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఈ భవనం ఖాళీగా పడి ఉంది. దీంతో పూర్తిగా పాతబడి సుమారు శిథిలావస్థకు చేరింది. 2000 సంవత్సరం నుండి, నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి ముఖ్యమంత్రి అధికారిక భవనం ఖాళీగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి తన సొంత ప్రైవేట్ నివాసంలో నివసించడానికి ఎంచుకోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ) నవీన్ పట్నాయక్ తన సుదీర్ఘ 24 సంవత్సరాల పదవీ కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇల్లు నవీన్ నివాస్ నుంచి రాష్ట్ర పాలన కార్యకలాపాలు నిర్వహించారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నిర్మించిన భవనం నవీన్ నివాస్ నుంచి పావు శతాబ్దం పాటు అన్ని అధికారిక, పరిపాలనా పనులు చివరి వరకు నిర్వహించారు. నవీన్ పట్నాయక్ పదవీకాలానికి ముందు ముఖ్యమంత్రి అధికారిక భవనం ముఖ్యమంత్రుల నివాసంతో నిత్యం హడావుడిగా ఉండేది. ఆయనకు ముందు మాజీ ముఖ్యమంత్రులు జేబీ పట్నాయక్, గిరిధర్ గొమాంగొలకు ఈ భవనం నివాసంగా ఉండేది.
పునరుద్ధరణ
ముఖ్యమంత్రి నివాసం చాలా కాలంగా నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వం ఎనిమిది నెలల పాటు దీర్ఘ కాలం శ్రమించి భారీ పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చింది. భారీ వ్యయ ప్రయాసలతో ఆ నివాసాన్ని మళ్లీ నివాసయోగ్యంగా పునరుద్ధరించారు. పునరుద్ధరించిన ఈ భవనంలో బహుళ సమావేశ గదులు, భద్రత కోసం ఒక వాచ్ టవర్ మరియు ముందు భాగంలో విశాలమైన ఆకర్షణీయమైన తోట సాదరంగా స్వాగతం పలుకుతుంది. మోహన్ చరణ్ మాఝీ ఇప్పుడు అధికారికంగా నివాసానికి మారడంతో ముఖ్యమంత్రి నివాసం పావు శతాబ్దం నిద్రాణస్థితి తర్వాత మరోసారి రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మారింది.
పవిత్ర హోమాదులతో గృహ ప్రవేశం
పూరీ నుంచి వచ్చిన 11 మంది బ్రాహ్మణ పూజారుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అధికారిక భవనం గృహ ప్రవేశం పూజాదులు అత్యంత నియమ నిష్టలతో నిర్వహించారు. హిందూ ఆచార సంప్రదాయాల ప్రకారం తొలుత ఆవు, దూడని ఇంటిలోకి అడుగు పెట్టించారు. ఈ ఆచారం కొత్త ఇంటికి శ్రేయస్సు, సానుకూల శక్తిని కూడగడుతుందని ముఖ్యమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. దీని తర్వాత ముఖ్యమంత్రి దంపతులు కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం నిర్వహించారు. పంచాంగం గణాంకాల ప్రకారం గురువారం ఉదయం 10.47 గంటలకు సీఎం మాఝీ తన కుటుంబంతో కలిసి నివాసంలోకి అధికారికంగా ప్రవేశించారు.
ముఖ్యమంత్రి అధికారిక భవనానికి పూర్వ కళ
Comments
Please login to add a commentAdd a comment