● జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన
వీరఘట్టం: జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఈ ఏడాది 18 నర్సరీల్లో 20.16 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖ అధికారి జి.ఎ.పి. ప్రసూన అన్నారు. వీరఘట్టం మండలం రేగులపాడులో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొక్కల పెంపకం బాధ్యతను అటవీ సెక్షన్, బీట్ ఆఫీసర్లకు అప్పగించామన్నారు. ప్రస్తుతం పాలకొండ రేంజ్ పరిధిలో 20,507 హెక్టార్లు, కురుపాం రేంజ్ పరిధిలో 32,681 హెక్టార్లు, పార్వతీపురం రేంజ్‌లో 26,301 హెక్టార్లు, సాలూరు రేంజ్‌లో 28,230 హెక్టార్లు కలిపి జిల్లా మొత్తం 1,07,719 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయన్నారు. వన నర్సరీల్లో పెంచే మొక్కలను ఈ ఏడాది జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సీతానగరం, వీరఘట్టం, సీతంపేట, భామిని, పాలకొండ అటవీ ప్రాంతాల్లో నాటించి అటవీ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. త్వరలో కుంకీ ఏనుగులను తెప్పించి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న 11 ఏనుగుల గుంపును సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏర్పాటుచేస్తున్న తాత్కాలిక ఎలిఫెంట్ జోన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆమె వెంట పాలకొండ రేంజర్ కె.రామారావు, వీరఘట్టం సెక్షన్ ఆఫీసర్ పి.రవిబాబు, సోషల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సోమేశ్వరరావు, తదితరులు ఉన్నారు.