పల్నాడు: మరో పది రోజుల్లో పెళ్లిళ్లు జరగాల్సిన కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆనందంగా షాపింగ్ చేసి కారులో సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న ఆ కుటుంబ సభ్యులను చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో రోడ్డు ప్రమాదం రూపంలో తీరని శోకం మిగిల్చింది. డివైడర్‌ను కారు ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు దుర్మరణం పాలు కాగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన కనపర్తి పెద సుబ్బారావు, సీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీనివాసరావు, రాంప్రసాద్ ఉన్నారు.
వీరిద్దరూ గుంటూరులో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి కుమార్తెలకు ఈనెల 17, 18 తేదీల్లో గ్రామంలోనే వివాహ నిశ్చితార్థాలు జరిగాయి. ఒకరికి ఈనెల 30న, మరొకరికి సెప్టెంబర్ 2న పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లింగారావుపాలెంలో ఉంటున్న పెద సుబ్బారావు కుటుంబ సభ్యులు కారులో గుంటూరు వెళ్లారు. శుభకార్యాలకు కావాల్సిన షాపింగ్ వగైరా పనులు చూసుకుని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మండలంలోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్ వద్దకు వచ్చే సరికి కారు జాతీయ రహదారి నుంచి యడ్లపాడు గ్రామం సర్వీసు రోడ్డులోకి మలుపు తిప్పే క్రమంలో అదుపుతప్పింది.
డివైడర్‌ను ఢీకొని టైర్ పంక్చర్ కావడంతో పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పెద సుబ్బారావు భార్య కనపర్తి సీతమ్మ (68) అక్కడికక్కడే మరణించింది. మనవరాలైన పెళ్లికూతురు కోమలి, మనవడు సాయి, కోడలు రుషికన్య, బంధువు పద్మ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరిని 108 వాహనంలో కోండ్రుపాడులోని కాటూరు వైద్యశాలకు తరలించారు.
సీతమ్మ మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరి మనవరాళ్ల పెళ్లిళ్లు చూడకుండానే సీతమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment