పదేపదే మోసం చేయడం చంద్రబాబు నైజం | - | Sakshi
Sakshi News home page

పదేపదే మోసం చేయడం చంద్రబాబు నైజం

Published Fri, Jan 31 2025 2:14 AM | Last Updated on Fri, Jan 31 2025 2:14 AM

పదేపదే మోసం చేయడం చంద్రబాబు నైజం

పదేపదే మోసం చేయడం చంద్రబాబు నైజం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట: ఎన్నికల ముందు హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అలవాటేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇటీవల సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై సీఎం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. హామీలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే అమలుచేయలేకపోతున్నామని నిందలు వేయడం చంద్రబాబు దివాళాకోరు తనానికి నిదర్శమని మండిపడ్డారు. 2014 ఎన్నికల ముందు రూ.87 వేల కోట్ల పంట రుణాలు, డ్వాక్రా రుణ మాఫీ హామీని, 2024 ఎన్నికల హామీ సూపర్‌ సిక్స్‌ను గెలిచాక చంద్రబాబు విస్మరించిన తీరును గోపిరెడ్డి గుర్తుచేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా రుణ మాఫీని అమలు చేయలేనని, అందుకు బడ్జెట్‌ సరిపోదని నిజాయితీగా వైఎస్‌ జగన్‌ చెప్పారన్నారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ అమలుచేసిన సంక్షేమ పథకాలకు ఏడాదికి రూ.54 వేలు కోట్లు అవసరమైతే.. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ పథకాలకు రూ.74 వేల కోట్లు, ఇతర పథకాలకు కలిపి రూ.1.21లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. గత ఎన్నికల ముందు కూడా వైఎస్‌ జగన్‌ ఆ హామీలను తాను ఇవ్వలేనని, అందుకు బడ్జెట్‌ సరిపోదని తేటతెల్లంగా ప్రజలకు చెప్పారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు ఇచ్చామని చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూ.1.10 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. మరి ఈ డబ్బంతా ఏం చేశారని, ఎక్కడికెళ్తోందని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేమని అంటున్నారని, మరి 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేసిన రూ.1.92 లక్షల కోట్ల అప్పులకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వడ్డీ కట్ట లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రొంపిచర్ల కన్వీనర్‌ కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెంపున్నారెడ్డి, ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ డైరక్టర్‌ పాలపర్తి వెంకటేశ్వరరావు, 8వ వార్డు ఇన్‌చార్జి షేక్‌ కరిముల్లా పాల్గొన్నారు.

‘కూటమి’కి గోపిరెడ్డి సూటి ప్రశ్నలు

– గత ప్రభుత్వంలో ధాన్యానికి రూ.2,200 మద్దతు లభిస్తే.. కూటమి ప్రభుత్వంలో రూ.1,500కు దిక్కు లేదు.

– 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి.

– ప్రతి ఏడాది జనవరి 1న జాబ్‌ క్యాలండర్‌ ఇస్తామన్నారు. ఫిబ్రవరి వస్తోంది క్యాలెండర్‌ ఏమైంది.

– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులను కళాశాలలు వెనక్కి పంపిస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.

– 167–ఏ నేషనల్‌ హైవే కోసం నకరికల్లు–చీరాల ఓడరేవు వరకు.. ఎకరా భూమి విలువ రూ.3 కోట్ల ఉంటే.. నష్టపరిహారం రూ.50 లక్షలే ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది.

– వచ్చే నెల 26న కోటప్ప కొండ తిరణాళ్లకు సంబంధించి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు మొదలు కాలేదు. 20 లక్షల మంది భక్తులు వచ్చే తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగినా సరైన నిర్ణయాలు తీసుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement