బాదుడే బాదుడు
నరసరావుపేటటౌన్: గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల పెంపు విషయంలో ఆచితూచి వ్యవహరించింది. పట్టణాలతోపాటు మునిసిపాలిటీలలో విలీన గ్రామాలకు కేవలం 10 శాతమే పెంచింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై చార్జీల పిడుగులు కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేని ప్రభుత్వం.. చార్జీల వడ్డన మాత్రం షురూ చేసింది. పట్టణ, సమీప గ్రామాల్లో ఎక్కువగా క్రయ, విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి రిజిస్ట్రేషన్ల చార్జీలు 15 శాతం పెంచనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పెంపు..
గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం పెంపునకు కూటమి సర్కారు సిద్ధమైంది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారనుంది. 2019 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచలేదు. పల్నాడు జిల్లాలో రొంపిచర్ల, సంతమాగులూరు, బల్లికురవ, చిలకలూరిపేట, నాదెండ్ల, నకరికల్లు మండలాల్లో ప్రస్తుత మార్కెట్ విలువల్ని సున్నా నుంచి 40 శాతం వరకు పెంచి జిల్లా స్థాయిలో ఆమోదం పొందారు. పెంచిన మార్కెట్ విలువలపై అభ్యంతరాల స్వీకరణను పూర్తి చేశారు. అదే విధంగా ఇతర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన మార్కెట్ విలువలు అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో క్రయ, విక్రయ దారులతో గత నాలుగు రోజులుగా రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిశాయి. ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి ఆసక్తి కనబరిచారు.
తొలుత జనవరికి.. కాస్త వాయిదా
తొలుత రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపును జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని నిశ్చయించుకున్న కూటమి సర్కారు.. ఈ ఆలోచనను కొంత వాయిదా వేసుకుంది. రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, నూతన సంవత్సరం రోజున పెంపుపై సొంత పార్టీ నాయకుల నుంచే ఫిర్యాదులు అందడంతో కాస్త వాయిదా వేసే ఆలోచనలో పడింది. ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు ఉండనుందని సమాచారం.
త్వరలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ల పెంపు ఉంటుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే అనివార్య కారణాల వలన ప్రస్తుతం పెంపుదల ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ల చార్జీల పెంపు అమల్లోకి రానుంది.
– రామ్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్
●
రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
పట్టణ ప్రాంతాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం
ఫిబ్రవరి నుంచి అమలుకు శ్రీకారం
తీవ్ర వ్యతిరేకత రావడంతో జనవరి నుంచి పెంచాలనుకొని ఫిబ్రవరికి వాయిదా
మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం మోపనున్న కూటమి సర్కారు
అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు నాయుడు ముసుగు తొలగిపోతోంది. ఎన్నికల్లో అలవిగాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిన బాబు.. అందలమెక్కిన వెంటనే నిజం స్వరూపం ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. ఎన్నికలకు ముందు బాదుడే బాదుడు అంటూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బాబు.. కొద్ది రోజుల క్రితం ట్రూఅప్ చార్జీలతో విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చారు. తాజాగా భూ రిజిస్ట్రేషన్ల పేరిట మరో వడ్డనకు రంగం సిద్ధం చేశారు. తొలుత నూతన సంవత్సర కానుకగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు సిద్ధమైన సర్కారు కాస్త వాయిదా వేసి ఫిబ్రవరి నుంచి అమలుకు చర్యలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment