సంస్కృతిలో భాగం ఎడ్ల బల ప్రదర్శన
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
రెంటచింతల: సంస్కృతి, సంప్రదాయాల్లో ఎడ్ల బల ప్రదర్శన ఒక భాగమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కానుక మాత చర్చి 175 ఏళ్ల తిరునాళ్ల సందర్భంగా గురువారం సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనను ఆయన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. కానుకమాత సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో ఎడ్ల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 21 ఏళ్ల తర్వాత రెంటచింతలలో కనుల పండువగా ఈ బల ప్రదర్శనను ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను, సహకరించిన వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే యరపతినేని మాట్లాడుతూ ఫిబ్రవరి 7న సెయింట్ జోసఫ్ పాఠశాల వజ్రోత్సవాలకు పూర్వ విద్యార్థిగా తాను బ్రహ్మానందరెడ్డితో కలిసి మళ్లీ వస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పులికూరి కాంతారావు, మాజీ వైస్ ఎంపీపీ సుమంత్‌రెడ్డి, అల్లం ప్రతాప్‌రెడ్డి, కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, బి.రామకృష్ణ, ఒ.ఇన్నారెడ్డి, పి.రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment