ప్రకృతి సాగులో మెరిసినారిలా
పెదకూరపాడు: వారందరూ మహిళా రైతులు.. రైతు సాధికారత సంస్థ సహాయంతో ప్రకృతి సాగు దిశగా ఒక్కో అడుగు ప్రారంభించారు.. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సేంద్రియ ఉత్పత్తులతో లాభాల బాట పతున్నారు. కషాయాలు, ఘన, జీవామృతాలను వినియోగించి సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెదకూరపాడు మండల వ్యాప్తంగా 524 ఎకరాల్లో 500 మంది మహిళా రైతులు భర్తల సాయంతో ప్రకృతి వనరులే పెట్టుబడిగా ఆకు కూరలు, కూరగాయలు, ముల్లంగి, చిక్కుడు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, గోంగూర, దోస, పత్తి, మిర్చిలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సహజంగా దొరికే పశువుల పేడ, గోమూత్రం, ఎరువులు, కషాయాలు, జీవామృతం, ఘనజీవామృతం పొలాల్లోనే తయారు చేసుకుని డ్రోన్లతో పిచికారీ చేయిస్తున్నారు.
రద్దీ ప్రాంతాల్లో విక్రయాలు
పండించిన పంట ఉత్పత్తులను నేరుగా విక్రయిస్తున్నారు. సమీప పట్టణాలకు తీసుకెళ్లి ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార సముదాయాల వద్ద అమ్మకాలు చేస్తున్నారు.
తోటి మహిళలను ప్రోత్సహిస్తున్నాం
రెండు ఎకరాల్లో పత్తి, మిర్చి, ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నా. రైతు సాధికారత సంస్థ సాయం అందిస్తోంది. ఆ సంస్థ ప్రతినిధుల సూచనల మేరకు మహిళా రైతులను ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్నాం.
– సర్వేపల్లి అమూల్య, పెదకూరపాడు
20 సెంట్లలో సేద్యం
మాకు ఉన్న 20 సెంట్లలో దోస, క్యారెట్, ముల్లంగి, తోటకూర, గోంగూర, పుదీనా సాగు చేశాను. మంచి ఆదాయం వస్తోంది. కుటుంబపోషణతోపాటు లాభాలు బాగానే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయమే మేలు.
– నందిగామ జోత్స్న.పెదకూరపాడు
సేద్య ‘సాధికారత’
పెదకూరపాడు ప్రాంతంలో 500 మంది మహిళా రైతుల సాగు
సేంద్రియ ఉత్పత్తులతో లాభాల బాట
ఖర్చులు బాగా తగ్గాయి
ఎకరంలో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. ప్రకృతి సేద్యంతో ఖర్చులు బాగా తగ్గాయి. దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పోషణతోపాటు పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. మేమే స్వయంగా ఉత్పత్తులను విక్రయిస్తున్నాం.
– షేక్ మహిబూబ్, పెదకూరపాడు
ఏదో పంటలో ఆదాయం వస్తోంది
రెండు ఎకరాల్లో దోస, చిక్కుడు, క్యారెట్, ఆకు కూరలు, ముల్లంగి, మిరప, పత్తి ఇలా అనేక రకాల పంటలను సాగు చేస్తున్నాం. వీటిలో ఏదో ఒక పంట ద్వారానైనా బాగా ఆదాయం వస్తోంది. ఆరోగ్యకరమైన కూరగాయలు తింటుంన్నాం. లాభదాయకంగా ఉంది.
–మట్టుపల్లి హృదయలక్ష్మి, పెదకూరపాడు
Comments
Please login to add a commentAdd a comment